ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రతిభకు తగ్గట్టుగానే వరల్డ్ టాప్ 5 విద్యాసంస్థలో సీటు దక్కింది. దీంతో జగన్ కుటుంబంతో పాటు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, భారతి దంపతులకు హర్షారెడ్డి, వర్షారెడ్డి అనే ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ చదువులో ప్రతిభావంతులే.
పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఫ్రాన్స్‌లో పేరెన్నికగన్న ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు లభించింది. అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయ బోతున్నారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి ఏ పరీక్ష రాసినా డిస్టింక్షన్ సాధిస్తూ వస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ (ఎంఎన్సీ)లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం అభించింది. దాన్ని వదులుకుని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేయడానికి ఆమె మొగ్గు చూపారు.
కరోనా సంక్షోభం అనంతరం పారిస్‌లోని ఇన్సీడ్ క్యాంపస్ రీఓపెన్ అయింది. దీంతో అక్కడ చేరడానికి ఆమె బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు కూతురిని పారిస్ సాగనంపడానికి ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు వెళ్లనున్నారు. ఈ నెల 25న హర్షారెడ్డి బెంగళూరు నుంచి పారిస్ బయల్దేరుతారు. కూతురికి వీడ్కోలు పలికిన అనంతరం జగన్ ఈ నెల 26వ తేదీ కూడా అక్కడే ఉంటారు. 27న తాడేపల్లి నివాసానికి తిరిగి వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
కాగా వైఎస్ జగన్ చిన్నకుమార్తె వర్షారెడ్డి అమెరికాలోని ఇండియానాలో గల ప్రతిష్ఠాత్మక నోట్రెడామ్ యూనివర్శిటీలో చదువుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో చిన్న కూతురిని యూనివర్సిటీలో నేరుగా చేర్పించేందుకు జగన్ దంపతులు స్వయంగా అమెరికా వెళ్లారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కూతురి కోసం అమెరికా వెళ్లిన ఆయన తన వ్యక్తిగత హోదాలోనే పర్యటించిన విషయం తెలిసిందే. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే పిల్లలు, కుటుంబానికి జగన్ కూడా ఎప్పుడూ సమయం కేటాయిస్తుండడం విశేషం.