నీవు నేర్పిన విద్యయే నీరాజాక్ష అనే నానుడి మనకు తెలిసిందే. ఎవరైనా ఒక తప్పు పని లేదా చేయకూడని పని చేస్తున్నారని అనుకోండి. ఏమయ్యా… ఈ పని ఎందుకు చేస్తున్నావు? తప్పు కదా అని ఎవరో వచ్చి అడిగారనుకోండి. వెంటనే ఎదుటి వ్యక్తి అయ్యా.. ఇది నా పుర్రెకు పుట్టిన బుద్ధి కాదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అంటాడు. అడిగినోడు తన గతం మర్చిపోయాడన్న మాట.
ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అదే జరుగుతోంది. ఏం జరుగుతోంది అంటారా ? అదేనండి … పార్టీ ఫిరాయింపులు. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ జిలానీలు వరుస కడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు 67 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు.
బాబు క్రమంగా 23 మందిని లాగేశారు. బాబు ఎంతమందినైతే టీడీపీలోకి లాగేశారో, ఎన్నికల్లో టీడీపీ సరిగా అంతమందినే గెలిపించుకోగలిగింది. ప్రస్తుతం వైసీపీ చేస్తున్న ఆపరేషన్ కు కొంతకాలం తరువాత టీడీపీలో ఎంతమంది మిగులుతారో చెప్పలేం. ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలు వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్ వైసీపీలో జాయిన్ అయ్యారు. కొన్నిరోజుల కిందట మాజీ మంత్రి శిద్దా రాఘవ రావు జంప్ జిలానీ అయ్యారు.
ఎమ్మెల్యేలు అధికారికంగా వైసీపీలో చేరలేదు. అధికారికంగా వైసీపీ ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. ఇది జగన్ పెట్టిన రూల్. ఇదో నైతిక నిబంధన. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అందులో గెలుస్తారో లేదో నమ్మకం లేదు. అందుకే పేరుకు వైసీపీలో చేరినా అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేలే. ఈ కారణంగానే మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ హయాంలో జంప్ జిలానీలకు ఏ నిబంధనలూ లేవు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే పచ్చ కండువాలు కప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండాపోయింది. ఫిరాయింపుదారుల్లో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు కూడా. అప్పటి గవర్నర్ నరసింహన్ మారుమాట్లాడకుండా ఫిరాయింపుదారులతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం వంద శాతం టీడీపీ ప్రభుత్వం కాదు. టీడీపీ, బీజేపీ, వైసీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అని చెప్పచ్చు.
వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా చేరిన తరువాతే వైకాపా అసెంబ్లీని బహిష్కరించింది. ఇది నైతికతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అప్పట్లో వైసీపీ చేసిన పనిని తప్పు పట్టలేము. కానీ అప్పట్లో స్పీకర్ కోడెల, టీడీపీ నేతలు అసెంబ్లీకి రానందుకు వైసీపీని తీవ్రంగా విమర్శించారు. అప్పట్లో ఫిరాయింపుదారులకు పదవుల కోసం బాబు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆనం సోదరులకు బాబు అలాగే చెయ్యిచ్చారు.
కానీ ఫిరాయింపుల విషయంలో బాబు చేసినట్లుగా జగన్ చేయడం లేదు. వైసీపీలో చేరిన టీడీపీ నాయకులకు జగన్ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. పార్టీలో చేరితే పదవులు వస్తాయనే ఆశలు పెట్టుకోవద్దని సంకేతాలు ఇచ్చారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా, అదే బాటలో జగన్ నడుస్తున్నారు. కానీ బాబు బాట కంటే భిన్నంగా ఉంది.