జగన్‌ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి సుమా

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేని శక్తులు ఇప్పుడు ఆయనను రకరకాల రూపాలలో అప్రతిష్టపాలు చేయడానికి విశ్వయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏ చిన్న అవకాశం వచ్చినా వదలుకోవడానికి సహజంగానే…

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేని శక్తులు ఇప్పుడు ఆయనను రకరకాల రూపాలలో అప్రతిష్టపాలు చేయడానికి విశ్వయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏ చిన్న అవకాశం వచ్చినా వదలుకోవడానికి సహజంగానే ఇష్టపడదు. అవకాశం ఉన్నా, లేకపోయినా బదనాం చేయడంలో ఆ పార్టీది అందెవేసిన చెయ్యి అన్నసంగతి అనేక సందర్భాలలో చూశాం. ఇదేమి కొత్తకాదు. గతంలో ఎన్‌టీఆర్‌ నాయకత్వంలో ఉన్న టీడీపీకి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలోకి వచ్చిన టీడీపీకి చాలా తేడా ఉంది. ఎన్‌టీఆర్‌ ప్రజలనే నమ్ముకున్నారు. తన విధానాలనే ఆయన ఎక్కువగా చెప్పుకునేవారు. ఆయనకు కుట్రలు, కుళ్లు రాజకీయాలు పెద్దగా తెలియవనే చెప్పాలి. అందువల్లే ఆయన రాజకీయంగా తన కుటుంబం చేతిలో, ముఖ్యంగా అల్లుడిచేతిలో దారుణంగా పరాభవ, పరాజయానికి గరైంది చూశాం.

ఎన్‌టీఆర్‌ను బయటవాళ్లు అప్రతిష్టపాలు చేయలేదు. స్వయంగా అల్లుడు నాయకత్వంలోని కుటుంబమే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయించింది. ఉన్నవి, లేవిని వదంతులు సృష్టించింది. ఇంటి పరువుపోతుందని కూడా బాధపడని కుటుంబం అది. కేవలం లక్ష్మీపార్వతిని అడ్డుపెట్టుకుని ఎన్ని ప్రచారాలు జరిగాయో వాటిని ప్రత్యక్షంగా చూసినవారందరికి తెలుసు. అప్పుడు సక్సెస్‌ అయ్యారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి రేసులోకి వచ్చిన తర్వాత ఆయనను ఎన్ని రకాలుగా బదనాం చేయాలో అంతా చేసేయత్నం జరిగింది. ఆయనపై పిచ్చి కేసులు, ఎన్నికల సమయంలో బ్యానర్లు కట్టారన్న కేసుతో సహా ఇరవైతొమ్మిది కేసులు పెట్టారు. వైఎస్‌ వాటన్నిటికి కోర్టుకు హాజరై కొట్టివేయించుకోవల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్‌ కాంగ్రెస్‌లో తిరుగుబాటు చేసినప్పడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారితో చేతులు కలిపి ఎంత దారుణమైన విషప్రచారం చేసింది ఇటీవలి చరిత్రే.

చంద్రబాబు తెలివిగా మీడియాను, ఆయా వ్యవస్థలలో ఉన్న కీలక వ్యక్తులను మేనేజ్‌ చేయడంలో దిట్టగా పేరొందారు. న్యాయవ్యవస్థలో ఆయనకు ఉన్న పలుకుబడి గురించి లాయర్లు కథలు, కథలుగా చెబుతుంటారు. ఇన్ని విద్యలు నేర్చినందునే, తద్వారా కుట్ర రాజకీయాలు చేయగలిగినందునే ఇంతకాలం ఆయన సక్సెస్‌ అయ్యారేమో! అది వేరే విషయం. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబే, ఆ తర్వాత వీర సమైక్యవాది లెక్క పోజుపెట్టి ఆంధ్రుల పొట్టకొట్టిందని సోనియాగాంధీపై దుమ్మెత్తిపోశారు. రాహుల్‌ గాంధీని దారుణంగా అవమానించారు. అప్పట్లో కెసీఆర్‌ను, జగన్‌ను కలిసి విమర్శించేవారు. అప్పుడు మోడీతో జతకట్టినందున ఆయనను వదలివేశారు. ఆ తర్వాత కాలంలో బీజేపీతో చెడిన తర్వాత మోడీని ఎంతనీచంగా దూషించింది చూశాం.

కాని చరిత్ర ఎప్పుడూ ఒకరకంగా ఉండదు కదా.. ఎల్లోమీడియాకు పోటీగా సోషల్‌ మీడియా అత్యంత చైతన్యంగా పనిచేయడంతో చంద్రబాబు వ్యూహాలు పనిచేయలేదు. దానికితోడు సామాజికవర్గాల సమీకరణ, రాజకీయ పార్టీల సమీకరణ పూర్తిగా మారిపోయింది. దాని ఫలితంగా ఆయన దారుణమైన పరాజయాన్ని చవిచూశారు. చంద్రబాబు ఎందుకు ఓడింది పైకి అర్థంకాలేదని చెప్పినా, ఆయనకు తెలుసు ఏమి జరిగిందన్న దానిపై. అందుకే కొత్త ఆలోచననలోకి వెళుతున్నారు. జగన్‌ను దెబ్బతీయాలంటే ఇప్పుడున్న సామాజిక సమీకరణలతో అసాధ్యం. అందుకే రెండు విషయాలపై దృష్టి పెడుతున్నారనిపిస్తుంది. ఒకటి ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడం, రెండు మతపరమైన దుష్ప్రచారం చేయడం. అంతేకాక టీడీపీ అనుకూల సోషల్‌ మీడియాలో జగన్‌ను, చంద్రబాబును పోల్చుతూ అబద్ధాలు ప్రచారం చేయడం. అందులో భాగమే.

వరద సహాయ చర్యలలో పెద్దగా నిరసనలు రాకపోయినా సోషల్‌ మీడియాలో పెయిడ్‌ ఆర్టిస్టుల ద్వారా వ్యతిరేక ప్రచారం చేయించారు. ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు వాటిని పాయింట్‌ అవుట్‌ చేయడం అభ్యంతరం కాదు. కాని లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చూపాలన్న తాపత్రయం మంచిదికాదు. జగన్‌ వచ్చి మూడునెలలు కాకముందే ఏదో ప్రమాదం జరిగిపోయినట్లు ప్రచారం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యూహాలలో భాగంగానే అమరావతి అనే భ్రమరావతిని ప్రజలలో ప్రచారం చేసి తాను ఉంటే ఏదో పొడిచేసేవాడినని ప్రజలలో నమ్మించాలని యత్నిస్తున్నారు. దానిని ఆయా కులాలకు అతీంగా ప్రాంతీయ సమస్యగా చిత్రీకరించడానికి చాలా కష్టపడుతున్నారు. పల్లెటూళ్లలో కొన్ని సామెతలు ఉంటాయి. ఒక వ్యక్తి  కొండను తాను మోస్తానని సవాల్‌ చేస్తే నిజమా అని జనం అంతా పోగు అవుతారు. అప్పుడు ఆ వ్యక్తి మీరు కొండను తీసి తననెత్తిన పెడితే మోస్తానని వాళ్లను పూల్‌ చేస్తాడు. అలాగే ఇప్పుడు ఏపీ ప్రజలను తాను అధికారంలో కొనసాగి ఉంటే అమరావతిని ఏదో చేసేసేవాడినని ప్రచారం ఆరంభించారు.

అది నిజమా? కాదా అన్నది అందరికి తెలుసు. నిజంగానే ఆ పరిస్థితి ఉంటే ఒక్క శాశ్వత భవనం కూడా ఎందుకు కట్టలేకపోయారన్నదానికి బదులులేదు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పదమూడువేల ఎకరాలు ముంపు ఉందని ఎందుకు అఫిడవిట్‌ ఇచ్చారు? ఎనిమిది వేల ఎకరాలు అమ్మితే రాజధాని అయిపోతుందని చెబుతున్నారు. మరి ఆ పని ఆయన ఎందుకు చేయలేదు. రాజధానికి లక్ష కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడిగారు. మోడీని ఎందుకు నిత్యం దూషించారు. ఇప్పుడు మోడీ రెండోసారి ఎన్నికయ్యాక ఆయన ఊసు ఎత్తేదైర్యం చేయడంలేదు. అది వేరే విషయం. అలాగే ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌ గురించి కూడా మాట్లాడలేదు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ గురించి కూడా మాట్లాడే ధైర్యం చేయడంలేదు. ఇక ముఖ్యమంత్రి జగన్‌ పైనే ఉన్నవి, లేనివి ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా నిజంగానే తన విశ్వరూపం చూపించడం ఆరంభించింది. రాజధాని తరలిపోతోందనో, ఇంకొకటనో టీడీపీవారు అనగానే పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. సుజనాచౌదరి లేదా మరి ఇతర టీడీపీ నేతలు కొన్న భూమలు గురించి మాట మాత్రం రాయడంలేదు. అలాగే కోడెల శివప్రసాదరావు దురాగతాలు వెలుగులోకి వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా జాగ్రత్తపడుతోంది. అదే జగన్‌పై టీడీపీ ఏ నేత చిన్న విమర్శ చేసినా పెద్దగా పోకస్‌ చేస్తున్నాయి. దానిని బట్టి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే చంద్రబాబుతో పాటు ఆయనకు మద్ధతు ఇచ్చే మీడియా కూడా జగన్‌ను సీఎంగా సహించలేకపోతున్నాయి. జగన్‌ తమ మద్ధతు లేకుండా సీఎం కావడం ఏమిటన్న దుగ్ధను కనబరుస్తున్నాయి. అందుకే ప్రాంతీయ విభేదాలు తేవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది.

కేసీఆర్‌తో స్నేహం అనో, గోదావరిని శ్రీశైలంలోకి తేవడానికి ఏపీ డబ్బు ఇచ్చేస్తున్నారనో, ఇలా అనేక వదంతులు సృష్టిస్తున్నారు. వీలైతే ఏపీలోనే ప్రాంతీయ వివాదాలు సస్టించడానికి, అది సాధ్యంకాని పక్షంలో తెలంగాణకు వ్యతిరేకంగా సెంటిమెంట్‌ రెచ్చగొట్టి ప్రజలలో తేడా తీసుకురావడానికి యత్నాలు జరుగుతున్నాయి. ఇక బీజేపీలోని ఒకవర్గం కూడా ఏ అవకాశం వచ్చినా వదలిపెట్టడం లేదు. ఈ మధ్య తిరుమలలో అన్యమత ప్రచారం అంటూ యాగిచేశారు. తీరాచూస్తే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అని తెలిసిన తర్వాత బీజేపీ నేతలు కాని, ఎల్లోమీడియా వారు కాని నోరు మూసేశారు. ఇంత పెద్ద హిందూనేతలు గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బూట్లతో హిందూ దేవుళ్ల పోటోలు పట్టుకుని పూజలు చేయడానికి వెళ్లినప్పుడు ఆయా పూజా సందర్భాలలో బూట్లతో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు. అంటే అప్పుడు మిత్రపక్షంగా, మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నారు కనుక కుక్కినపేనులా పడి ఉన్నారని అనుకోవాలా?

ఒకసారి క్రిస్టమస్‌ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ క్రీస్తును నమ్ముకుంటే విజయమేనని బోధచేసి వచ్చారు. మరి అప్పుడు కూడా ఈ హిందూమత ఉద్ధారకులు కనీసం ప్రశ్నించలేదే? ఇక్కడ పాయింట్‌ ఏమిటంటే చంద్రబాబు తప్పుచేశారా? లేదా అన్నది చర్చకాదు. కాని బీజేపీనేతలు, వారికితోడుగా టీడీపీ నేతలు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ జగన్‌పై మతపరమైన అభియోగాలు మోపాలని, ఆయనేదో హిందూ వ్యతిరేకి అన్న చందంగా ప్రచారం చేయాలని తాపత్రయ పడుతున్నారే.. అది దారుణం అని చెప్పడానికి ఈ విషయాలు చెప్పవలసి వస్తోంది. అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి జగన్‌ నిరాకరించారని కూడా ఏపీ బీజేపీ దుర్మార్గంగా అబద్దపు  ప్రచారం చేసింది. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వివాదం సృష్టించడానికి, బీజేపీ, టీడీపీలు చేసిన ప్రయత్నం, దానికి ఒకపత్రిక సహకరించిన వైనం నాకు తెలుసు.

అప్పుడు ఆ పత్రికలోనే నేను పనిచేసేవాడిని. పంచాయతీరాజ్‌ శాఖ వారు ఒక జీఓ ఇచ్చారు. దానిప్రకారం తిరుమల మీద పంచాయితీ ఎన్నికలు జరపకుండా ఉండడం కోసం కొన్ని చదరపు కిలోమీటర్ల మేర మినహాయింపు ఇచ్చారు. అందులో హిందూనేతలు కొత్త విషయం కనిపెట్టారు. ఆ పరిధిలో మూడు కొండలే ఉన్నాయని, ఏడుకొండలకు గాను మూడుకొండలు చేశారంటూ దిక్కుమాలిన తప్పుడు ప్రచారం చేశారు. ఆ వార్త వేయడం సరికాదని ఆ కంపెనీ ఎండీకి నేను చెప్పాను. కాని టీడీపీ ప్రయోజనాలే ఊపిరిగా పనిచేసే ఆయన జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చి ఆ తప్పుడు వార్తను ప్రముఖంగా ప్రచురించారు. విశేషం ఏమిటంటే ఆ జీఓ ఇచ్చిన మంత్రి దివాకరరెడ్డి హిందువు. కాని ఈ మొత్తం ప్రచారాన్ని వైఎస్‌కు వ్యతిరేకంగా సంధించారు. అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా ఉంటుంది.

రాజకీయ పార్టీలు, పార్టీ ముద్రలేకుండా పార్టీకి ప్రచారం చేసే మీడియా అధిపతులు ఎంత దారుణంగా వ్యవహరిస్తారన్నదానికి ఇది ఉదాహరణ. వీటన్నికి ఒకటే కారణం కనిపిస్తుంది. సామాజికవర్గాలలో అత్యధిక వర్గాలు జగన్‌కు అండగా ఉన్నాయి. అందువల్లే ఏభైశాతం ఓట్లతో ఆయన గెలిచి అధికారంలోకి వచ్చారు. దానిని భగ్నం చేసి, ప్రజలలో మార్పు తేవాలంటే మతపరమైన విషప్రచారం చేయాలన్నది వీరి వ్యూహం. జగన్‌ గంగానదిలో పవిత్రస్నానం చేసినా వీరు గమనించరు. శారదాపీఠంలోను, చినజియ్యర్‌ స్వామీ వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నా ఒప్పుకోరు. ఆయన పలుచోట్ల ఎంత భక్తి ప్రపత్తితో పూజలు చేసినా, అవేమీ తెలుగుదేశం మీడియాకు కనిపించవు.

అర్జంట్‌గా గతంలో అరాచకాలు చేసిన తెలుగుదేశం పార్టీని మళ్లీ కుర్చీలో కూర్చోపెట్టడం ద్వారా తమ స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించుకోవాలన్నదే వీరి లక్ష్యంగా ఉంటుంది. ఈ విషయాలన్నిటిని ముఖ్యమంత్రి జగన్‌ దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా అడుగులు వేయాలి. భరోసాగా ముందుకువెళితే దారిలో గోతులు ఉంటాయన్న సంగతి అర్థం చేసుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే రీజియన్‌, రిలిజియన్‌ పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు చెక్‌ పెట్టకపోతే ప్రజలను జగన్‌ వ్యతిరేక శక్తులు రెచ్చగొట్టేయత్నం చేస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. కనుక తస్మాత్‌ జాగ్రత్త!
-కొమ్మినేని శ్రీనివాసరావు