ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలలో ఉన్నత విద్య అనే దీపాన్ని వెలిగించిన దేవుడిలా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దానికి కొనసాగింపుగా ఫీజుల నియంత్రణపై దృష్టిపెట్టారు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల విచ్చలవిడి ఫీజులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజుల విధానం అమలులోకి రానుంది.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న విద్యాశాఖ అధికారులు, వీటిని జగన్ ముందు పెట్టబోతున్నారు. ఆయన సూచలనతో వచ్చే ఏడాది నుంచి ఫీజుల నియంత్రణ అమలులోకి వస్తుంది. సంక్షేమ పథకాల అమలులో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న జగన్, ఈ ఫీజుల నియంత్రణ విషయంలో కూడా అంతే వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఐటీ ఎంట్రన్స్ ల పేరు చెప్పి తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు గుంజుతున్న కార్పొరేట్ స్కూల్స్ కి ముకుతాడు పడబోతోంది.
ఇంటర్మీడియట్ పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ మాఫియాగా మారిన కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రక్షణ లభించనుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ కు అనుమతి తీసుకుని కోచింగ్ సెంటర్లు నడుపుతున్న కళాశాలలపై కొరడా ఝళిపించారు అధికారులు, కోచింగ్ సెంటర్ల బోర్డులు తీసేయించారు. హైటెక్, టెక్నో లాంటి పదాలతో ఉన్న బోర్డులన్ని తొలిగించారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఫీజుల విధానం ప్రక్షాళణ మొదలు కాబోతోంది.
అయితే ఫీజుల నియంత్రణను కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటాయేమోనన్న అనుమానాలూ బలంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ ఫీజుల విషయంలో ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే వాటికి అదనంగా ట్యూషన్ ఫీజులు, స్పెషల్ ఫీజులు అంటూ జాబితా పెంచేసి అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాయి విద్యాసంస్థలు. డీఈవోలతో పాటు ఇతర ఉన్నతాధికారులు వీరికి వంతపాడుతుండటంతో ఫీజులకి అడ్డుకట్ట పడలేదు.
ప్రత్యేకంగా ఫీజులపై నియంత్రణ పెట్టాల్సిన పనిలేకుండా.. ఇప్పటికే ఉన్న నిబంధనలను కచ్చితంగా పాటించగలిగితే.. కార్పొరేట్ మాఫియాకు కళ్లెం పడే అవకాశముంది. జగన్ ఆ దిశగా అడుగులు వేస్తే.. కోట్లాదిమంది తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించినవారవుతారు.