గవర్నర్ సంతకంతో సీఆర్డీఏ కాలగర్భంలో కలిసిపోయింది. చంద్రబాబు ఆర్భాటంగా ప్రవేశపెట్టి, ఎన్నో అక్రమాలకు కేరాఫ్ గా మార్చిన సీఆర్డీఏను రద్దుచేస్తూ గవర్నర్ సంతకం చేయడంతో ఇక అది చరిత్రలో కలిసిపోయినట్టయింది. దాని స్థానంలో ఏఎమ్ఆర్డీఏ (అమరావతి మెట్రోపాలిటిన్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ) వచ్చింది. కొత్త విధానాన్ని, కొత్త సంస్థను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు జారీచేసింది.
కొత్తగా ఏర్పడిన అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ.. గత సంస్థలా అరచేతిలో వైకుంఠం చూపించదు. గాల్లో మేడలు కట్టదు. ఊహల్లో ప్లాన్స్ చూపించదు. గ్రాఫిక్స్ జోలికి అస్సలు పోదు. కేవలం ప్రస్తుత పరిస్థితులు, ఆర్థిక స్థితిని అంచనా వేసి.. వాస్తవ పరిస్థితుల్లో ప్రజలకు ఏది అవసరమో వాటిని మాత్రమే ప్రతిపాదిస్తుంది. మెల్లమెల్లగా అభివృద్ధిని చూపిస్తుంది.
అమరావతి ప్రాంతంలో ఉన్న రైతుల్లో స్థైర్యాన్ని నింపడంతో పాటు, ఆర్థికంగా వాళ్లను పరిపుష్టం చేసేందుకు కావాల్సిన అన్ని వనరుల్ని, ప్రణాళికల్ని ఏఎమ్ఆర్డీఏ సమకూరుస్తుంది. స్వల్ప కాలంలో రియల్ ఎస్టేట్ మళ్లీ పెరగడానికి ఏం చేయాలనే అంశంతో పాటు, దీర్ఘకాలంలో మెట్రోరైళ్లు, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం వంటి అంశాలపై కూడా ఏఎమ్ఆర్డీఏ పనిచేస్తుంది.
ఏఎమ్ఆర్డీఏకు కమిషనర్ గా లక్ష్మీ నరసింహాను అపాయింట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో పాటు ఇతర సభ్యుల్ని కూడా పేర్కొంది. పురపాలక శాఖ కార్యదర్శి, ఏఎమ్ఆర్డీఏకు ఉపాధ్యక్షుడిగా ఉంటారు. సంస్థలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, గుంటూరు-కృష్ణా జిల్లాల కలెక్టర్లు, డైరక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు.