వర్షాలను సెంటిమెంట్ గా తీసుకునే సమాజం మనది. వర్షం కురవడమే మంచి ముహూర్తం, మంచి ముహూర్తం రోజున వర్షం కురుస్తుందనే బలమైన భావనలున్న సమాజం మనది. ప్రత్యేకించి వర్షం కోసం ఎదురుచూసే రాయలసీమ ప్రాంతంలో అయితే వర్షం కురిసిన రోజు ఉండే హర్షం అలాంటిలాంటిది కాదు! సకాలంలో పడే వర్షాలు రాయలసీమ రైతులను అపరిమితంగా ఆనంద పెడతాయి.
ఎన్నో కరువులను చూసిన వారు రాయలసీమ రైతులు. ఆ కరువు కథల గురించి ఎంత చెప్పినా తక్కువే. కరువు రైతులు ప్రభుత్వాల వంక ఆశగా చూస్తారు, పాలకుడెవరనేది బాగా గమనిస్తారు. పాలకుడికి, వర్షాలకూ సంబంధం ఉంటుందనేది కూడా రైతులు బాగా నమ్మే అంశం. వారి నమ్మకానికి తగ్గట్టుగా.. పాలకుడు మారడానికి వర్షపాతానికి సంబంధం ముడిపడినట్టుగా కనిపిస్తూ ఉంది పరిస్థితి!
గత ఏడాది, ఈ ఏడాది..అంతకు ముందు ఐదు సంవత్సరాలూ.. ఈ పరిణామాలను గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ముందుగా ఈ ఏడాది చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సీమలో పుష్కలమైన వర్షపాతం నమోదవుతూ ఉంది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ సారి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మే నెలలోనే వర్షాలు ప్రారంభం అయ్యాయి. మే లోనే రెండు మూడు భారీ వర్షాలు కురిశాయి. మే నెలలో వర్షం అనేది రాయలసీమలో ఎవ్వరూ అంత ఊహించుకునేది కాదు. మే లోనే మంచి వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనులతో సమాయత్తం అయ్యారు. పనులు చకచకా పూర్తి చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో జూన్ మొదట్లోనే భారీ స్థాయిలో వేరుశనగ సాగయ్యింది.
మామూలుగా అయితే జూలై ఆఖర్లో వేరుశనగ సాగవ్వడమే కష్టం అనే పరిస్థితి ఉండేది. అలాంటిది జూన్ లోనే కొన్ని వేల ఎకరాల్లో వేరుశనగ సాగయ్యింది. ఇక జూలై నెలలో ఇప్పటికే ఇతర ఖరీఫ్ పంటలు కూడా బాగా సాగయ్యాయి. పత్తి ఇతర పంటలు కూడా బాగా సాగయ్యాయి. ఇప్పటికే పంటల సాగు పనులు దాదాపు పూర్తవుతున్నాయి. జొన్న, కొర్ర, శనగ వంటి పంటలు సాగు చేసే రైతులు మాత్రం ఇంకా అదును కోసం వేచి ఉన్నారు.
మరోవైపు గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో చాలా వరకూ బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మరీ కొద్ది ప్రాంతాలను మినహాయిస్తే.. గత ఏడాది రబీ పంట కూడా బాగా సాగయ్యింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆరంభంలోనే కురిసిన వర్షాలతో బోర్లలో నీళ్లు పుష్కలమైన లభ్యత ఉంది. ఈ నేపథ్యంలో బోర్ల కింద కూడా రకరకాల పంటలు సాగవుతున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే.. చాలా సంవత్సరాలుగా బంజరుగా ఉండిపోయిన భూములు కూడా ఇప్పుడు మళ్లీ సాగులోకి వస్తున్నాయి! రైతులు తమ తమ పనులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సారి వేరుశనగ రైతులు భారీ దిగుబడి మీద కూడా ఆశలతో ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల పంట సాగై ముప్పై రోజులు గడిచాయి. వేరుశనగ దాదాపు వంద రోజుల పంట. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా ఇదే తరహాలో వర్షాలు కురిస్తే.. వేరుశనగ భారీ దిగుబడి సాధిస్తారు రైతులు. ఆ మేరకు పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.
ఈ అంశాలే ఇప్పుడు జగన్ పాలన గ్రాఫ్ ను పెంచేదిగా మారింది. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి రాయలసీమలో మంచి వర్షాలు కురుస్తున్నాయనే భావన ప్రజల్లో నెలకొంటూ ఉంది. గత ఏడాది జూలై ఆరంభం నుంచి మంచి వర్షపాతాన్ని చూస్తున్నారు రైతులు. గత ఏడాది ఖరీఫ్ వేరుశనగ కూడా ఫర్వాలేదనే దిగుబడి సాధించింది. భారీ వర్షాలు కొన్ని కురవడంతో రబీ లో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది మరింత సానుకూల పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు సీమలోని అనేక ప్రాంతాలకు వివిధ సాగునీటి ప్రాజెక్టులు పచ్చదనాన్ని పంచుతున్నాయి.
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అనేక మండలాల గతిని హంద్రీనీవా ప్రాజెక్టు మార్చేస్తోంది. కడప, కర్నూలు జిల్లాలకూ వివిధ సాగునీటి ప్రాజెక్టులు అండగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఈ ప్రాజెక్టులకో భారీ జలకళ సంతరించుకుంది. ఈ సారి కూడా అదే స్థాయి నీళ్లు అందినా.. మరింత గొప్ప మార్పును చూడవచ్చు. ఇదే సమయంలో జగన్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే పనులూ మొదలుపెడుతున్నారు. ఇదంతా రాయలసీమ మళ్లీ వ్యవసాయంతో రతనాల సీమగా మారే శుభసూచకాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి కూడా సహకరించడం, అదే సమయంలో సీమ పట్ల తన చొరవతో పాలకుడిగా జగన్ చరిత్రకు ఎక్కేలా ఉన్నాడు.