ఆ ప‌నిచేస్తే మైనార్టీల్లో జ‌గ‌న్‌కు తిరుగుండ‌దు

వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోని వైఎస్సార్‌సీపీకి ముస్లిం , ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో మంచి ప‌ట్టు ఉంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 151 సీట్ల‌లో వైసీపీ గెలుపొంద‌డానికి ప్ర‌ధానంగా మైనార్టీలే కార‌ణం. ఇటీవ‌ల కేంద్ర‌ప్ర‌భుత్వం…

వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోని వైఎస్సార్‌సీపీకి ముస్లిం , ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో మంచి ప‌ట్టు ఉంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 151 సీట్ల‌లో వైసీపీ గెలుపొంద‌డానికి ప్ర‌ధానంగా మైనార్టీలే కార‌ణం. ఇటీవ‌ల కేంద్ర‌ప్ర‌భుత్వం సీఏఏ, ఎన్ఆర్‌సీ అమ‌లుకు శ్రీ‌కారం చుట్ట‌డం, ఈ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. పార్ల‌మెంట్‌లో ఆ బిల్లుల‌కు వైసీపీ, టీడీపీ మ‌ద్ద‌తు ప‌లికాయి.  వైసీపీ నిర్ణ‌యం మ‌రీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీల్లో అసంతృప్తి రేపింది.

అలాగే దేశ వ్యాప్తంగా రోజురోజుకూ ముస్లింల‌కు మ‌ద్ద‌తుగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగ‌డం, ఢిల్లీలో ఆప్ చేతిలో బీజేపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూటక‌ట్టుకున్న నేప‌థ్యంలో మోడీ స‌ర్కార్‌పై నెమ్మ‌దిగా నిర‌స‌న గ‌ళాలు వినిపిస్తున్నాయి.  సీఏఏ, ఎన్ఆర్‌సీల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో అమ‌లు చేసేది లేద‌ని గ‌త డిసెంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ఫ‌ష్టం చేశారు. అయితే అసెంబ్లీలో తీర్మానం చేయాల‌ని ఎంఐఎం నేత‌, జ‌గ‌న్ మిత్రుడైన అస‌దుద్దీన్ ఒవైసీ రెండురోజుల క్రితం డిమాండ్ చేశాడు.

బీజేపీతో వైసీపీకి మిత్రుత్వం ఉన్న నేప‌థ్యంలో….ఆ రెండింటిపై మోడీ స‌ర్కార్‌కు అనుకూలంగా ముందుకు వెళితే రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని గ్ర‌హించిన జ‌గ‌న్ ఓ మంచి నిర్ణ‌యానికి వ‌చ్చాడు. సీఏఏ, ఎన్ఆర్‌సీల‌ను ఏపీలో అమ‌లు చేసేది లేద‌ని అసెంబ్లీలో తీర్మానించేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధ‌మైంది. ఈ విష‌యం రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట‌ల్లో వ్య‌క్త‌మైంది.

సీఏఏ, ఎన్ఆర్‌సీల‌పై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి బుధ‌వారం మీట్ ది మీడియాలో కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. మైనార్టీలు వైసీపీలో అంత‌ర్భాగ‌మ‌ని, వారు అభ‌ద్ర‌త‌గా భావించే దేన్నైనా త‌మ పార్టీ అంగీక‌రించ‌బోద‌ని  స‌జ్జ‌ల తేల్చి చెప్పాడు.  బీజేపీతో పోటీ  ఉన్న రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలే …సీఏఏ, ఎన్ఆర్‌సీ వంటి వాటికి వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేశాయ‌ని చెప్పాడు. రాష్ట్రంలో బీజేపీతో పోటీగానీ, భ‌యంగానీ లేద‌న్నాడు.

‘అధికారంలో మేమే ఉన్నాం. మ‌మ్మ‌ల్ని దాటి వాటిని అమ‌లు చేసే ప‌రిస్థితి ఉండ‌దు. ఆ ధీమాతోనే మేము వెంట‌నే స్పందించ‌లేదు. అంతే త‌ప్ప మ‌రొక‌టి కాదు. అవ‌స‌ర‌మైతే రేపు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. జ‌గ‌న్ అధికారంలో ఉన్నంత వ‌ర‌కూ అలాంటి వాటిని అమ‌లు చేయ‌నివ్వ‌ర‌ని హామీనిస్తున్నాం’ అని ఆయ‌న గ‌ట్టిగా చెప్పాడు. జ‌గ‌న్ స‌ర్కార్ నుంచి ఇలాంటి నిర్ణ‌యాన్నే ముస్లింలు ఆశిస్తున్నారు. ముస్లింల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా జ‌గ‌న్  స‌ర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేస్తే మాత్రం…రాజ‌కీయంగా ముస్లింల‌లో మ‌రోసారి తిరుగులేని ప‌ట్టు నిలుపుకుంటారు.

జ‌గ‌న్ నిర్ణ‌యం ఒక ర‌కంగా మోడీ స‌ర్కార్‌కు ధిక్కార‌మే. మోడీ అంటే విప‌రీత‌మైన కోపంతో ఉన్న ముస్లింల‌కు….ఆయ‌న్ను వ్య‌తిరేకించే వారెవ‌రైనా హీరోగా క‌నిపిస్తార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో  సీఏఏ, ఎన్ఆర్‌సీల అమ‌లు చేసేది లేద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ తీర్మానం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంద‌ని స‌జ్జ‌ల మాట‌లు చెబుతున్నాయి. ఈ ప‌నిచేస్తే…జ‌గ‌న్‌కు ముస్లింల‌లో తిరుగుండ‌ద‌ని ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది.

అంత ధైర్యం ఎవడికైనా ఉందా?