టెన్త్, ఇంటర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం సంగతేమో గానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు తాను పరీక్ష పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. అనవసరంగా రాజకీయ పంతాలు, పట్టింపులకు పోయి , నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేక సతమతం అవుతున్నట్టుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 7నుంచి నిర్వహించాల్సిన టెన్త్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలను హైకోర్టు సూచనతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్‌తో నారా లోకేశ్ ఓ చిన్నసైజ్ పోరాటం చేపట్టిన సంగతి తెలిసిందే. లోకేశ్ చేపట్టాడు కాబట్టే, ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోందనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లింది. రెండుమూడు రోజుల క్రితం కూడా విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు.
తాజాగా టెన్త్ పరీక్షల వాయిదాకే ప్రభుత్వం మొగ్గు చూపడం విశేషం. ఈ విషయమై హైకోర్టుకు కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. అలాగే సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో టెన్త్ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉండటంతో పాటు కేసుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని సీఎం సమీక్షించారు.
కర్ఫ్యూ సమయంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇబ్బంది పడే అవకాశముందని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీంతో వాయిదా వేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. జూలైలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా టెన్త్ పరీక్షల నిర్వహణపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. టీచర్లకు టీకాలు ఇచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. లిఖిత పూర్వకంగా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచన కూడా లేదని ప్రభుత్వం కోర్టుకు తేల్చి చెప్పింది. తదుపరి విచారణ జూన్ 18కి హైకోర్టు వాయిదా వేసింది.
తెలంగాణలో టెన్త్ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మాదిరిగానే టెన్త్ ఫలితాలను తెలంగాణలో ఈ దఫా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఎలాగైనా నిర్వహించాలనే పట్టుదల ఏపీ సర్కార్‌లో కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ ఆశయం మంచిదైనప్పటికీ, పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని మానవీయ దృష్టితో ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం వల్లే ప్రభుత్వం అనవసర సమస్యలను కొని తెచ్చుకుంటోంది. అదే ఇప్పుడు జగన్ సర్కార్ తనకు తాను పెట్టుకుంటున్న పెద్ద పరీక్ష అయి కూచుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.