టీటీడీ నూతన పాలక మండలి ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే చైర్మన్‌గా తన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి నియమించిన సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. దీంతో చైర్మన్‌తో కలుపుకుంటే టీటీడీ పాలక మండలిలో మొత్తం 25 ఉంటారు.
ఇదే సందర్భంలో ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మందిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు కంటే కొసరే డబుల్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకమనేది సీఎం, ప్రభుత్వ నిర్ణయమేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్ప డం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రత్యేక ఆహ్వానితులకు బోర్డు సభ్యులతో సమానంగా దర్శన అవకాశం ఉంటుందన్నారు. కానీ బోర్డు సమావేశాలతో ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధం ఉండదని ఆయన తేల్చి చెప్పారు.
మరోవైపు గతంలో ఎప్పుడూ లేనంతగా భారీగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. దీంతో టీటీడీ విశిష్టతను తగ్గించినట్టైందనే ఆరోపణలు లేకపోలేదు. చివరికి టీటీడీని కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్ మార్చారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
రాజకీయంగా అన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకు ఒక్క తన పదవి తప్ప, మిగిలిన అన్ని చోట్ల రెట్టింపు స్థాయిలో నియామకాలు చేపట్టడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. డిప్యూటీ సీఎంలను మొదలుకుని, ఇటీవల ఏర్పాటైన మున్సిపల్, కార్పొరేషన్ల పాలక మండళ్లలో వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల వరకూ సమీకరణలను గమనించొచ్చు. జగన్ మార్క్ పాలనకు ప్రతిదీ నిదర్శనంగా నిలుస్తోంది. అది మంచో, చెడో రాబోవు ఎన్నికల్లో తేలనుంది.