జగన్ కు పవన్ చేసిన మేలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిసో తెలియకో వైఎస్ జగన్ కు ఓ మేలు చేసారు. జగన్ ను దగ్గరకు తీసి, కేంద్ర ప్రభుత్వంలో వైకాపాకు చోటిస్తే, తాను భాజపాతో దోస్తీకి కటీఫ్ చెప్పేస్తా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిసో తెలియకో వైఎస్ జగన్ కు ఓ మేలు చేసారు. జగన్ ను దగ్గరకు తీసి, కేంద్ర ప్రభుత్వంలో వైకాపాకు చోటిస్తే, తాను భాజపాతో దోస్తీకి కటీఫ్ చెప్పేస్తా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజకీయంగా ఇది తొందరపాటు మాట. ఆయన మనసులో ఆ విషయం వుంటే వుండొచ్చు. కానీ అంత బహిరంగంగా చెప్పాల్సిన మాట కాదు. టైమ్ కాదు. 'ఆ సమయం వస్తే ఆలోచిద్దాం' లాంటి పడికట్టు పదాలు వాడి తప్పించుకోవాలి. అంతే తప్ప ఇలా కుండ బద్దలు కొట్ట కూడదు.

ఇప్పుడు ఏమవుతుంది. భాజపాకు ఓ ఆలోచన వస్తుంది. రాజకీయంగా అగ్రెసివ్ గా వుండేవాళ్లతో, లేదా రాజకీయంగా గడియకు తడవకు ఓ రంగు మార్చే వాళ్లతో దోస్తీ చేయాలంటే సాధారణంగా ఆలోచిస్తారు. చంద్రబాబు ఇప్పుడు దగ్గర కావాలని తహ తహలాడుతున్నా భాజపా దూరంగానే వుంచుతున్నది ఈ కారణంగానే. ఆయన ఎప్పుడు కలుస్తారో? ఎప్పుడు విడిపోతారో? ఆయనకు మాత్రమే తెలుసు. ఫక్తు తన అవకాశవాదమే తనది. ఇది భాజపాకు రెండుకు మూడుసార్లు అనుభవం అయింది. అందుకే పక్కన పెట్టింది.

ఇప్పుడు తన అవసరాల కోసం, తన సినిమాల కోసం, తనకు మద్దతు కోసం పవన్ కళ్యాణ్ భాజపాకు దగ్గర అయ్యారు. ఇంకా నెల నిండలేదు. అప్పుడే అలా చేస్తే, ఇలా చేస్తా లాంటి స్టేట్ మెంట్ లు ఇవ్వడం వల్ల భాజపా కు అనుమానం ప్రారంభమవుతుంది. పవన్ వెళ్లిపోతాడని భయపడి వైకాపాను దగ్గరకు తీయడం మానేస్తుందా? లేదా తీస్తుందా? అన్నది అలా వుంచితే, పవన్ ను రాజకీయంగా ఎంకరేజ్ చేయడానికి ఆలోచిస్తుంది.

ఇలాంటి అగ్రెసివ్ వ్యవహారాల మనిషిని దగ్గరకు తీసి, మద్దతు ఇచ్చి ఓ లెవెల్ కు తెస్తే, ఏదో ఒక టైమ్ లో సమస్య వస్తుందేమో? అన్న అనుమానం ఇప్పుడు పొడసూపుతుంది. అందువల్ల వైకాపాను దగ్గరకు తీసే వ్యవహారం అలా వుంచితే, పవన్ కు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చేఅంశం మాత్రం సందిగ్ధంలో పడుతుంది. ఇది జగన్ కు పూర్తిగా కలిసి వచ్చే అంశం కావచ్చు. ఆ విధంగా పవన్ తొందరపడి మాట జారి జగన్ కు మేలు చేసారనే అనుకోవాలి.

మరో 'సామజవరగమన' వస్తుందా?