జగన్ పంచ్: పేదలకు వెల్ఫేర్.. చంద్రబాబుకి ఫేర్ వెల్

అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా సీఎం జగన్, చంద్రబాబుపై అదిరిపోయే పంచ్ వేశారు. సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన ఆయన.. ఏపీలోని పేదలకు ఇది వెల్ ఫేర్ క్యాలెండర్ అన్నారు. అదే సమయంలో అది…

అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా సీఎం జగన్, చంద్రబాబుపై అదిరిపోయే పంచ్ వేశారు. సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన ఆయన.. ఏపీలోని పేదలకు ఇది వెల్ ఫేర్ క్యాలెండర్ అన్నారు. అదే సమయంలో అది చంద్రబాబుకి ఫేర్ వెల్ క్యాలెండర్ అంటూ సెటైర్ వేశారు. చంద్రబాబుకే కాదు, చంద్రబాబుకి బాకాలూదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 లకు ఇది గుబులు పుట్టించే క్యాలెండర్ అని కామెంట్ చేశారు జగన్.

జగన్ ఇలా పంచ్ లు వేయడం ఇదే తొలిసారి కాదు. ఈ సెషన్ లోనే ఇంతకుముందు ఆయన రెండు సార్లు చంద్రబాబుపై తన మార్క్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. మోదీ స్వయంగా ఫోన్ చేసి చంద్రబాబుకు చెప్పారు.. అమిత్ షా ఫోన్ చేసి రాధాకృష్ణకు చెప్పారు అంటూ పంచ్ లు వేశారు. అంతకంటే ముందు.. జెలుసిల్, ఈనో ప్యాకెట్లు పెట్టుకోవాలంటూ జోకులేశారు. ఇప్పుడు సెషన్ క్లైమాక్స్ లో వెల్ఫేర్.. ఫేర్ వెల్ అంటూ బాబుపై అదిరిపోయే పంచ్ వేశారు జగన్.

ఏ పథకం ఎప్పుడు..?

ఏ పథకం కింద ఏ నెలలో ఎవరికి ఆర్థిక సాయం అందుతుందనే విషయాన్ని ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ప్రకటించడం జగన్ కి అలవాటు. ఈ ఏడాది కూడా ఈ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశారాయన. ఏప్రిల్ లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలతో సంక్షేమ క్యాలెండర్ మొదలవుతుంది. మే నెలలో విద్యా దీవెన, రైతు భరోసా, మత్స్యకార భరోసా డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో పడతాయి.

జూన్ లో అమ్మఒడి, జులైలో విద్యా కానుక, వాహన మిత్ర, జగనన్న తోడు, కాపు నేస్తం ఆర్థిక సాయం అందుతుంది. ఆగస్ట్ లో నేతన్న నేస్తం, సెప్టెంబర్ లో వైఎస్సార్ చేయూత, అక్టోబర్ లో రెండో విడత రైతు భరోసా, వసతి దీవెన, నవంబర్ లో విద్యా దీవెన, డిసెంబర్ లో ఈబీసీ నేస్తం, 2023 జనవరిలో రైతు భరోసా చివరి దఫా, ఆసరా.. ఇలా ఈ క్యాలెండర్ కొనసాగుతుంది.

ముందుగానే ఈ క్యాలెండర్ విడుదల చేస్తే, దాని ప్రకారం పేదలు తమ అవసరాలకు సరిపడా సొమ్ము ఎప్పుడు అందుతుందనే విషయంపై ఓ అవగాహనకు వస్తారని, అలా పేదల అవసరాలను తీర్చేలా ఆ సొమ్ము ఉపయోగపడుతుందని చెప్పారు సీఎం జగన్. తమది అంకెల గారడీ బడ్జెట్ కాదని, మూడేళ్లుగా ప్రజా సంక్షేమం, అభివృద్ధికోసం మంచి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. కరోనా సమయంలోనూ సంక్షేమ ఫలాలు అందరికీ అందాయనే విషయాన్ని గుర్తు చేశారు జగన్.

కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అందరికీ అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పిన జగన్.. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలు తమ ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ముగిసినట్టు ప్రకటించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. సభను నిరవధికంగా వాయిదా వేశారు.