మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి పెద్ద కుమారుడు మూలె హర్షవర్ధన్‌రెడ్డికి కీలక పదవి దక్కింది. ఎర్రగుంట్ల నగర పంచాయతీ చైర్మన్‌గా హర్షవర్ధన్‌రెడ్డిని కూచోపెట్టేందుకు వైసీపీ నిర్ణయించింది. జమ్మలమడుగు నియోజక వర్గంలో ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఉంది.
ఈ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులున్నాయి. వీటిలో 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7 స్థానాలకు ఎన్నికలు జరగ్గా …అన్నింటిలోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఎర్రగుంట్ల నగర పంచాయతీలో అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసినట్టైంది. ఇదిలా ఉండగా నగర పంచాయతీలోని 16వ వార్డు నుంచి మైసూరా తనయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తండ్రితో విభేదించి వైఎస్ జగన్ వెంట హర్ష నడుస్తున్నారు.
అలాగే మైసూరా తమ్ముని కుమారుడైన డాక్టర్ సుధీర్‌రెడ్డి వైసీపీ తరపున జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్‌తో రాజకీయంగా విభేదించిన పార్టీ నుంచి మైసూరారెడ్డి బయటికొచ్చిన సమయంలో …డాక్టర్ సుధీర్, హర్షవర్దన్‌రెడ్డి మాత్రం జగన్ వెంటే నడవడం అందరీ దృష్టిని ఆకర్షించింది.
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి రాజకీయ ప్రభావం నామమాత్రమైంది. చివరికి జమ్మలమడుగులో కూడా ఆదినారాయణరెడ్డి నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేకపోయారు. 20 వార్డులున్న జమ్మలమడుగు మున్సిపాలిటీలో కేవలం 2 చోట్ల మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
ఇదిలా ఉండగా జమ్మలడుగులో పార్టీకి పెద్ద దిక్కులేని సమయంలో డాక్టర్ సుధీర్‌రెడ్డి, ఆయన పెదనాన్న ఎంవీ మైసూరారెడ్డి తనయుడైన హర్షవర్ధన్‌రెడ్డి జగన్‌కు అండగా నిలిచారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆదినారాయణరెడ్డి సాగించిన రౌడీయిజాన్ని తట్టుకుని ఎదురొడ్డి నిలబడడంలో డాక్టర్ సుధీర్‌కు హర్ష ఎంతో అండగా నిలిచి పార్టీ శ్రేణులకు నైతిక మద్దతు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఎర్రగుంట్ల నగర పంచాయతీ నుంచి తన పెదనాన్న కుమారుడైన హర్షవర్ధన్‌రెడ్డికి ప్రాతినిథ్యం కల్పించడంతో పాటు చైర్మన్ పదవిని ఇచ్చేలా జగన్‌తో సుధీర్‌రెడ్డి చర్చలు జరిపారు. సుధీర్ ప్రయత్నాలు ఫలించాయి. జగన్‌ను నమ్ముకున్నందుకు హర్షకు తగిన న్యాయం జరిగిందనే అభిప్రాయాలు జమ్మలమడుగు నియోజకవర్గంలో వ్యక్తమవుతున్నాయి.