జగన్ సర్కార్ మరో తప్పు చేస్తోంది. జగన్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రజానీకం సమాచార హక్కును కాలరాయడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలన అంటే పారదర్శక ఉండాలి. జీవోలను దాచి పెట్టాలనే జగన్ సర్కార్ నిర్ణయంతో… తప్పు చేస్తున్నట్టు తనకు తానే నిరూపించుకున్నట్టైందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. జీవోలను గోప్యంగా ఉంచాలనే నిర్ణయంలో మతలబు ఏంటో ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ప్రతిపక్షాలకు మరో ఆయుధాన్ని చేజేతులా ఇచ్చినట్టైంది.
2008 నుంచి ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. అంటే జీవోలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు తన తండ్రి వైఎస్సార్ హయాంలో శ్రీకారం చుట్టారనే సంగతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరిచిపోయినట్టున్నారు. ఇక మీదట ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)లను ఆన్‌లైన్‌లో ఉంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శల పాలవుతోంది.
ఇప్పటి వరకూ ఏదైనా జీవో కావాలంటే సులభంగా తీసుకునేవారు. ఇకపై అలాంటి సౌలభ్యం కరువైంది. జీవోల్ని ఉంచే ‘గవర్న మెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టరులో (జీఓఐఆర్)’ జీవో నంబర్లు జనరేట్ చేసే విధానాన్ని ఇకపై అనుసరించ వద్దని, అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు దీనికి అనుగుణంగా వ్యవహరించాలని సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి (రాజకీయ) రేవు ముత్యాలరాజు లేఖ రాశారు.
ఇప్పటికే ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం బ్లాంక్ జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. దానికి మరింత కొనసాగింపు అన్నట్టుగా ఏకంగా జీవోలే కనిపించకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏంటనే ఆగ్రహం పౌర సమాజం నుంచి వస్తోంది.
ఒకవైపు ప్రపంచం సాంకేతికంగా ఎంతో పురోభివృద్ధి సాధిస్తూ… సమాచార విప్లవం వెల్లువెత్తుతుంటే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా వెనక్కి వెళ్లడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎవరికీ ఏమీ తెలియకూడదని ప్రభుత్వం భావిస్తున్న దంటే… ఏదో జరగరానిదే జరుగుతుందన్న అనుమానాలకు జగన్ ప్రభుత్వ నిర్ణయం బీజం వేసింది. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఎవరిస్తున్నారో అనే విమర్శలు వస్తున్నాయి.