టీచ‌ర్స్‌తో క‌య్యానికి దిగిన జ‌గ‌న్ స‌ర్కార్‌

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఎన్నిక‌ల హామీల‌ను చిత్త‌శుద్ధితో అమ‌లు చేస్తూ ప్ర‌జాభిమానం పొందుతున్నారు. ఇదే రీతిలో రానున్న కాలంలో కూడా పాల‌న సాగిస్తే జ‌గ‌న్‌కు వ‌చ్చే సారి కూడా తిరుగుండ‌ద‌నే వాద‌న…

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఎన్నిక‌ల హామీల‌ను చిత్త‌శుద్ధితో అమ‌లు చేస్తూ ప్ర‌జాభిమానం పొందుతున్నారు. ఇదే రీతిలో రానున్న కాలంలో కూడా పాల‌న సాగిస్తే జ‌గ‌న్‌కు వ‌చ్చే సారి కూడా తిరుగుండ‌ద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. 

ఇది నాణేనికి ఒక వైపు. జ‌గ‌న్ పాల‌న‌కు సంబంధించి నాణేనికి రెండో వైపు కూడా త‌ప్ప‌క చూడాలి. కొన్ని వ‌ర్గాల‌తో జ‌గ‌న్ స‌ర్కార్ కోరి క‌య్యానికి దిగుతోంది. కొంత మంది ఐఏఎస్ అధికారుల‌కు పెత్తనం ఇచ్చి, ఏమ‌న్నా చేసుకోపోండి అని ప్ర‌భుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వ‌డం అస‌లుకే ఎస‌రు తెస్తోంది.

చంద్ర‌బాబును గ‌ద్దె దించ‌డంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల పాత్ర కీల‌క‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అందులోనూ వారిలో ఉపాధ్యాయుల సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంది. తాజాగా ఉపాధ్యాయుల‌తో జ‌గ‌న్ స‌ర్కార్ అన‌వ‌స‌రంగా క‌య్యానికి దిగింది.

ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల బ‌దిలీల ప్ర‌క్రియ‌కు సంబంధించి షెడ్యూల్ ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల సీనియారిటీకి సంబంధించి పాయింట్స్ కేటాయింపులో ప్ర‌భుత్వం అసంబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

8 సంవ‌త్స‌రాల‌కే క‌ట్ ఆఫ్ డేట్ విధించి, ఆ మేర‌కే పాయింట్స్ కేటాయిస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇదే ఇప్పుడు ఉపాధ్యాయుల ఆగ్ర‌హానికి గురైంది. ఇలా చేయ‌డం వ‌ల్ల , 8 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డి ప‌నిచేస్తున్న వాళ్ల సీనియారిటీ మాటేంట‌ని ఉపాధ్యాయులు ప్ర‌శ్నిస్తున్నారు. దీని కోస‌మేనా జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా చేసుకున్న‌ద‌ని ఉపాధ్యాయులు నిల‌దీస్తున్నారు. మంచి చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌ని, త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో తీవ్రంగా న‌ష్ట‌ప‌రుస్తున్నార‌ని ఉపాధ్యాయులు మండిప‌డు తున్నారు.

2009, 2010, 2011 నుంచి పని చేస్తున్న వేలాది ఉపాధ్యాయులు, అనగా 9/10/11 సంవత్సరాలుగా దూర ప్రాంతాల్లో క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, 2012 నుంచి అనగా 8 సంవత్సరాలుగా పనిచేసిన వారితో సమానంగా పాయింట్స్  ఇవ్వాల‌నుకోవ‌డం ఏంట‌ని ఆవేద‌న‌తో ప్ర‌శ్నిస్తున్నారు. 

దూర ప్రాంతాల్లో సుదీర్ఘ కాలం పాటు  పనిచేసిన టీచర్స్ పాయింట్స్ విషయం లో తీవ్రంగా నష్టపోయి మళ్ళీ దూరప్రాంతాలకే ప‌రిమితం కావాల్సి వ‌స్తోంద‌నే ఆందోళ‌న వారిలో క‌నిపిస్తోంది. గ‌తంలో ఎప్పుడూ 8 సంవత్స‌రాల స‌ర్వీస్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పాయింట్స్ కేటాయించిన దాఖ‌లాలు లేవ‌ని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు.

ఒక పాఠశాలలో పనిచేసిన కాలానికి ఇచ్చే స్టేషను పాయింట్లను 8 సంవత్సరాలకే కుదించడం అన్యాయమ‌ని ఉపాధ్యాయులు నిన‌దిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ పులివెందుల‌కు చెందిన ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ఉదాహ‌ర‌ణ‌తో చ‌క్క‌గా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.  

ఉదాహరణకు
*A అనే టీచర్* పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని కోమన్నూతల పాఠశాలలో 2009 Nov 26 నుండి 11 సం గా పని చేస్తున్నాడు. ( *రావలసిన పాయింట్లు 11×3=33*)

*B అనే టీచర్* ఎర్రగుడి (చక్రాయపేట మండ‌లం)లో 2010 DSC ద్వారా నియమితుడై 10 సంవ‌త్స‌రాలుగా పని చేస్తున్నాడు.( *రావలసిన స్టేషను పాయింట్లు 10×3=30*)

*C అనే టీచర్* అగడూరులో 2011 జూన్ నుంచి 9 సంవ‌త్స‌రాలుగా పని చేస్తున్నాడు.( *రావలసిన స్టేషను పాయింట్లు 9×3=27*)

*D అనే టీచర్* వేంపల్లి పట్టణంలో 2012 జూలై నుంచి పని చేస్తున్నాడు. ( *రావలసిన పాయింట్లు 8×3=24*)

కానీ ఉన్నతాధికారులు ఈ నాలుగు చోట్ల వివిధ సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు స్టేషన్‌ పాయింట్లు 8×3=24 గా కేటాయించారని ఉపాధ్యాయులు వివ‌రిస్తున్నారు. ఇది అన్యాయ‌మ‌ని ఉపాధ్యాయులు గ‌గ్గోలు పెడుతున్నారు.

త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీఈవో కార్యాల‌యాల ఎదుట భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టేందుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు స‌మాయ‌త్తం అవుతున్నాయి.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఉపాధ్యాయుల్లో వ్య‌తిరేక‌త రావ‌డానికి మూడున్న‌రేళ్లు ప‌ట్టింద‌ని, ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ విష‌యంలో ఏడాదిన్న‌ర‌కే ఆ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీనంత‌టికి కార‌ణం పేనుకు పెత్త‌నం ఇచ్చిన చందంగా రాష్ట్ర‌స్థాయిలో ఓ ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల‌ను న‌మ్మి పెత్త‌నం ఇవ్వ‌డ‌మే అని ఆరోపిస్తున్నారు.

విద్యారంగంలోని ఆ ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల చెప్పుడు మాట‌లు విని జ‌గ‌న్ స‌ర్కార్ ఉపాధ్యాయ వ్య‌తిరేక విధానాల‌కు పాల్ప‌డుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విద్యార్థుల‌కు పాఠాలే కాదు, పాల‌కుల‌కు గుణ‌పాఠాలు చెప్పే విద్య ఉపాధ్యాయుల‌కు బాగా తెలుస‌ని ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయ సంఘాలు హెచ్చ‌రిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఉపాధ్యాయుల బ‌దిలీల విష‌యంలో పాయింట్ల కేటాయింపులో ప్ర‌భుత్వం త‌న నిర్ష‌యాన్ని పున‌రాలించుకోక‌పోతే త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని ఉపాధ్యాయ‌సంఘాల నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు.

ప్ర‌భుత్వం పట్టింపుల‌కు పోతుందా?  లేక పున‌రాలోచించి ఉపాధ్యాయుల‌కు న్యాయం జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటుందా? అనేది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంది.

విజన్ 2020 అంటే అర్థం చేసుకోలేకపోయాం