పోలవరం ఆగిపోయింది, హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు. మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డుకట్ట.. ఇలాంటి హెడ్డింగ్ లు పెట్టి.. ప్రజల్లో లేని పోని భయాందోళనలు సృష్టించడం అలవాటుగా చేసుకుంది ఎల్లో మీడియా. మీడియా అధిపతులా లేక పార్టీ ప్రతినిధులా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఎల్లో మీడియా జనం. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని పర్యవసానాలు ఎలా ఉన్నా.. ముందుగానే దుష్ప్రచారం చేస్తున్నారు.
అయితే జగన్ ప్రభుత్వం మీడియాను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలేవీ చేయలేదు. మీడియా సంస్థల అధిపతుల ద్వంద్వ వైఖరిని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు కానీ, వాటిపై పక్షపాతం చూపించలేదు జగన్. కానీ అతి మంచి పనికి రాదని, వ్యతిరేక మీడియాపై.. ప్రభుత్వం కూడా వ్యతిరేక వైఖరితోనే ఉండాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఫార్ములాని జగన్ ఫాలో కావాల్సిందేనంటున్నారు.
తెలంగాణలో కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీ9, ఏబీఎన్ ఛానెళ్లపై ఉక్కుపాదం మోపారు. తెలంగాణలో ఎక్కడా వాటి ప్రసారాలు రాకుండా అడ్డుకున్నారు. రెవెన్యూ పడిపోయి, దిక్కుతోచని స్థితిలో హరీష్ రావు లాంటి కీలక నేతల రాయబారాలు కూడా ఫలించని వేళ, కోర్టు కూడా చేతులెత్తేసిన సమయంలో.. ఆ రెండు సంస్థల యాజమాన్యాలు దారికొచ్చాయి. చివరకు ఉద్యోగుల జీతాలు, జీవితాలకు ఇబ్బంది రాకూడదని కేసీఆర్ కనికరించారు. ఏబీఎన్ తెలంగాణలో ఇప్పటి వరకూ కోలుకోలేదు.
ఈ ఒక్క దెబ్బతో తెలంగాణ మీడియా పూర్తిగా దారిలోకి వచ్చింది. ఏపీలో మాత్రం ఇంకా తోకజాడిస్తోంది. అధికార మార్పిడి జరిగినా కూడా ఇంకా ఆ జాతి మీడియాకు చంద్రబాబే ముఖ్యమంత్రి. జగన్ నిర్ణయాలన్నిటినీ వ్యతిరేకించడమే దీని పని. పోనీ అలా వదిలేద్దామనుకుంటే రానురాను పరిస్థితి మరింత విపరీతంగా తయారవుతోంది. జగన్ చేస్తున్న మంచి పనులకు కూడా వక్రభాష్యాలు చెప్పడం ప్రారంభమైంది.
ఇలాంటి నీచ మీడియా పనిపట్టాలంటే కేసీఆర్ ఫార్ములా ఫాలో కావాల్సిందే. కచ్చితంగా యెల్లో మీడియా తోకలు కత్తిరించాల్సిందే. ఆ పని ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిదంటున్నారు వైసీపీ నేతలు.