జగన్ సర్కార్ మరో అద్భుత నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ఐదురోజులకే పింఛన్ మంజూరు చేసే బృహత్తర పథకానికి జూన్ ఒకటి నుంచి శ్రీకారం చుట్టనుంది. నిజంగా దీన్ని పక్కాగా అమలు చేస్తే మాత్రం జగన్ సర్కార్ గొప్ప పనిచేసినట్టే. ఎందుకంటే చంద్రబాబు పాలనలో కొత్తవాళ్లకి పింఛన్ రావాలంటే ఉన్నవాళ్లలో ఎవరు చస్తారా అని ఎదురు చూసే దుస్థితిని చూశాం. ఆ తర్వాత వైఎస్సార్ హయాంలో అలాంటి విధానానికి స్వస్తి చెప్పి అర్హులైన వాళ్లను ఎంపిక చేయడాన్ని చూశాం.
నేడు జగన్ పాలనకు వచ్చే సరికి ఏకంగా పింఛన్ లబ్ధి దారుల ఎంపిక నిత్య ప్రక్రియగా చేపడుతుండటం అద్భుత నిర్ణయమనే చెప్పాలి. క్షేత్రస్థాయిలో ఎవరికీ అసంతృప్తి ఉండకూడదనే సదాశయంతో పింఛన్లు అందించాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారులు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.
ఎవరైనా పింఛన్‌కు దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలించి అర్హత ఉందని అధికారులు భావిస్తే కేవలం ఐదు రోజుల్లో ఎంపిక చేస్తారు. ఆ మరుసటి నెల నుంచే కొత్త లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేసేలా జగన్ సర్కార్ ముందడుగు వేయడంలో పాలనలో వచ్చిన మార్పుగా భావించవచ్చు. సామాన్య ప్రజలకు ఇది ఎంతో ఊరటనిచ్చే విధానమనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. అంతేకాదు పింఛన్ కోసం మండల కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే బాధ తప్పుతుంది. అంతేకాదు, ఇంటి దగ్గరికే వచ్చి దరఖాస్తులు తీసుకోవడం మొదలుకుని తిరిగి మంజూరు పత్రాల వరకూ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవడం జగన్ పాలనలో తీసుకొచ్చిన గొప్ప సంస్కరణగా చెప్పుకోవచ్చు.
గ్రామ సచివాలయంలో దరఖాస్తు ప్రక్రియ మొదలై, తిరిగి సచివాలయాల ద్వారానే మంజూరు పత్రాలు అందజేస్తారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ రాజాబాబు కొత్తగా పింఛను మంజూరులో వివిధ దశల ప్రక్రియను వివరించారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి స్వయంగా గానీ లేదంటే వలంటీరు ద్వారా గ్రామ, వార్డు సచివాలయంలో పింఛను దరఖాస్తును ఇవ్వాలి. అర్హతకు సంబంధించిన ధృవీకరణ పత్రాలన్నీ సమర్పించాలి.
గ్రామీణులకైతే ఎంపీడీఓలు, పట్టణవాసులకైతే మున్సిపల్ కమిషనర్లు అర్హత నిర్ధారించి పింఛను మంజూరు చేస్తారు. ఈ మంజూరు పత్రాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాలకు చేరిన తర్వాత వాటిని వలంటీరు ద్వారా లబ్ధిదారుని పంపిణీ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలు తమ అర్హతలకు సంబంధించి పత్రాలు అందజేయడమే చేయాల్సిన ఏకైక పని. మిగిలిందంతా జగన్ సర్కారే చూసుకుంటుంది.