‘మండలి ’లో చోటు చేసుకుంటున్న పరిణామాలను సీఎం జగన్ ‘లైట్’ తీసుకున్నట్టు సమాచారం. అక్కడి పరిణామాలను ముందే అంచనా వేసిన జగన్…ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే అంశంపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. శాసనసభలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలిపి మండలికి పంపారు. ఆ తర్వాత రూల్ 71ను అడ్డం పెట్టి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆ రెండు బిల్లులను కనీసం మండలిలో ప్రవేశ పెట్టడానికి కూడా సతాయించడంతో టీడీపీ ఉద్దేశం ఏంటో మరింత స్పష్టతకు వచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచనకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలను మరో రోజుకు పొడిగించింది. బుధవారం మండలిలో ఆ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపనున్నట్టు కొందరు మంత్రులు ఆందోళనతో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ జగన్ మాత్రం రిలాక్ష్‌గా ఉండాలని, మండలి పరిణామాలను ముందే ఊహించినవే అన్నట్టు సమాచారం.
ఒకవేళ ఆర్డినెన్స్‌తో సంబంధం లేకుండా, ఒకవేళ సెలక్ట్ కమిటీ పంపేందుకు ఇంకా మూడు నెలల సమయం ఉందని, ఇప్పటికిప్పుడే తరలించే ఉద్దేశం కూడా లేదు కదా అని మంత్రులతో జగన్ అన్నట్టు తెలుస్తోంది. ‘తరలింపు తథ్యం. అలాంటప్పుడు ఆందోళన ఎందుకు. ఈ రోజు కాకపోతే రేపు. రేపు కాకపోతే ఇంకో రోజు’ అని అన్నట్టు తెలుస్తోంది.
జగన్‌కు జరగబోయే పరిణామాలపై ఓ అంచనా ఉండటం వల్లే పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహించలేదని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కొంత మంది ఎమ్మెల్సీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా జగన్ వద్దని వారించినట్టు తెలుస్తోంది.