ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 'తీగలాగితే డొంక కదులుతుంది' అంటూ కొన్ని రోజులుగా పోలవరంపై వస్తున్న కథనాల నేపథ్యంలో అందరి దృష్టి ఈ పర్యటనపై పడింది. కథనాలు, ఊహాగానాలకు అనుగుణంగానే జగన్ తన నిర్ణయాల్ని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణంలో సమాచార లోపాన్ని ఎన్నిచూపారు.
గడిచిన మూడేళ్లుగా పోలవరం పనులు సజావుగా సాగలేదని స్వయంగా అధికారులు చెప్పడంతో జగన్ విస్మయం చెందారు. నిధులు మాత్రం విడుదలవుతున్నాయని, బిల్లులు క్లియర్ అవుతున్నాయని పనులు మాత్రం నడవలేదని అన్నప్పుడు జగన్ ఒకింత సీరియస్ అయ్యారు. ఇప్పటివరకు జరిగిన పనులపై ఆడిటింగ్ చేయడానికి నిపుణుల కమిటీని వేయాలని అక్కడికక్కడే నిర్ణయించారు.
అలా పోలవరం అక్రమాల్ని వెలికితీసే క్రమంలో తొలి అడుగు వేశారు ముఖ్యమంత్రి. ఒక్కసారి నిపుణుల కమిటీ రంగంలోకి దిగితేచాలు, అడుగడుగునా అక్రమాలు-అవినీతి కనిపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన జగన్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అందుకే చంద్రబాబు అధికారంలోకి రాకముందు పోలవరం ఎంతశాతం పూర్తయింది, బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఎంతశాతం పనులు పూర్తయ్యాయనే వివరాల్ని అడిగారు సీఎం. ఆ వివరాలు లేవని అధికారులు చెప్పడంతో జగన్ మళ్లీ ఆశ్చర్యపోయారు.
నిర్వాసితులకు పరిహారం అందించకుండా పనుల్ని కొనసాగించడంపై కూడా జగన్ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. ముందుగా పునరావాసం కల్పించి, పరిహారం అందించిన తర్వాత పనులు చేయకుండా.. గ్రామస్థుల్ని ఖాళీ చేయించేసి వాళ్లను గాలికొదిలేశారని గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఐదేళ్లలో నిర్వాసితులందరికీ పరిహారం అందాలని, సమాంతరంగా పనులు కూడా పూర్తిచేయాలని ఆదేశించారు.
మొత్తమ్మీద పోలవరం విషయంలో అందరి అంచనాలకు తగ్గట్టుగానే వ్యవహరించారు జగన్. ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని తవ్వితీయాలని నిర్ణయించారు. 4 నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం. మరోవైపు పనులు ఆగిపోకుండా, 2021నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.