ఢిల్లీకి జ‌గ‌న్…మోదీతో కీల‌క భేటీ!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌ధాని మోదీతో భేటీకి ముహూర్తం ఖ‌రారైంది. జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై రాజ‌కీయ ఆస‌క్తి నెల‌కుంది. ఒక‌వైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు రోడ్…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌ధాని మోదీతో భేటీకి ముహూర్తం ఖ‌రారైంది. జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై రాజ‌కీయ ఆస‌క్తి నెల‌కుంది. ఒక‌వైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు రోడ్ మ్యాప్ ఇవ్వాల‌ని బీజేపీని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అడిగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అడిగిన వెంట‌నే జ‌గ‌న్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం జ‌న‌సేనాని జీర్ణించుకోగ‌ల‌రా? అనేది ప్ర‌శ్న‌.

గ‌తంలో బీజేపీతో పొత్తులో ఉన్న‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోదీ అపాయింట్‌మెంట్ అతిక‌ష్టం మీద ఇచ్చేవారు. ప‌దిసార్లు ప్ర‌య‌త్నిస్తే… రెండుసార్లు క‌లిసేందుకు అవ‌కాశం ఇచ్చేవాళ్ల‌ని స్వ‌యంగా చంద్ర‌బాబే ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శించారు. కానీ జ‌గ‌న్ విష‌యంలో మాత్రం కేంద్ర ప్ర‌భుత్వం భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌ధాన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌ధానితో జ‌గ‌న్ భేటీ కానున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. పోల‌వ‌రం నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై పున‌రాలోచ‌న చేయాల‌ని విన‌తి, అలాగే విభ‌జ‌న హామీల అమ‌లుకు త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప్ర‌ధానిని జ‌గ‌న్ కోర‌నున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అంశాన్ని కూడా ప‌రిశీలించాల‌ని ప్ర‌ధాని మోదీని జ‌గ‌న్ కోర‌నున్నార‌ని తెలిసింది.

క‌డ‌పలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తులు, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ, మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు మార్గం సుగుమం చేయాల‌ని ప్ర‌ధానిని కోరే అవ‌కాశాలున్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏది ఏమైనా జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న స‌ర్వ‌త్రా రాజ‌కీయ ఉత్కంఠ రేపుతోంది.