జగన్ మాటతో అధికారుల్లో హడల్

కలెక్టర్లు, ఎస్పీలతో రివ్యూ మీటింగ్ లు పెట్టినప్పుడు ఎప్పుడూ జగన్ వారిపై పరుషంగా మాట్లాడింది లేదు. వీడియో కాన్ఫరెన్సుల్లో అందర్నీ ఆప్యాయంగా పేరుపెట్టి మరీ పిలిచేవారు. తనకంటే పెద్దవారిని అన్నా అనేవారు. అలాంటి జగన్…

కలెక్టర్లు, ఎస్పీలతో రివ్యూ మీటింగ్ లు పెట్టినప్పుడు ఎప్పుడూ జగన్ వారిపై పరుషంగా మాట్లాడింది లేదు. వీడియో కాన్ఫరెన్సుల్లో అందర్నీ ఆప్యాయంగా పేరుపెట్టి మరీ పిలిచేవారు. తనకంటే పెద్దవారిని అన్నా అనేవారు. అలాంటి జగన్ తాజాగా జరిగిన కొవిడ్ మీటింగ్ లో కాస్త అసహనంగా కనిపించారట. అయితే దానికి కారణం లేకపోలేదు.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఎక్కడో ఒకచోట ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తూనే ఉన్నాయి. కొన్నిచోట్ల డాక్టర్లు నిరసన తెలుపుతుంటే, ఇంకొన్నిచోట్ల వైద్యసిబ్బంది, మరికొన్ని చోట్ల కరోనా పేషెంట్లు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇకపై ఇలాంటివి లేకుండా చూడాలని జగన్ అధికారుల్ని ఆదేశించారు. కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన వ్యక్తి తనకి ఆస్పత్రిలో బెడ్ కావాలని అడిగిన 30నిమిషాల లోపు వారికి బెడ్ చూపించగలగాలి, అలా చేయనప్పుడు మనం ఎందుకు అని కలెక్టర్లను ప్రశ్నించారు ముఖ్యమంత్రి. నేరుగా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లే దీనికి బాధ్యులవుతారు అని సున్నితంగా హెచ్చరించారు.

ఐసోలేషన్ వార్డులు, కొవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లు.. ఇలా మూడు రకాలుగా విభజించి కరోనా అనుమానితుల్ని, పాజిటివ్ వచ్చినవారిని, తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారికి ప్రభుత్వం వైద్యం అందిస్తోంది. అదే సమయంలో ఇంట్లోనే ఉండటానికి అవకాశం ఉంటే హోమ్ ఐసోలేషన్ కి సిఫార్సు చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం కరోనా పేషెంట్ల అవస్థలంటూ రోజుకో వీడియోని బైటకు వదులుతున్నాయి. తప్పులు జరగడంలేదని కాదు కానీ చిన్న చిన్న తప్పుల్ని పదే పదే చూపెడుతూ మిగతా వారిని భయభ్రాంతులకు గురిచేయడం ఇంకా పెద్ద తప్పు.

అందుకే జగన్ తొలిసారి కాస్త కటువుగా అధికారులకు ఆదేశాలిచ్చారు. కరోనా పేషెంట్ల విషయంలో బెడ్లు లేవని ఎవర్నీ తిప్పి పంపకూడదని, అలా తిప్పిపంపితే, తర్వాతి పరిణామాలకు కలెక్టర్లు, జేసీలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో అధికారుల్లో హడావిడి మొదలైంది. జగన్ తో సమావేశం ముగిసిన తర్వాత చాలామంది జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులతో ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టుకుని కరోనా వైద్యంపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో కొవిడ్ నోడల్ అధికారులు కొవిడ్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులకు బాధ్యులుగా ఉన్నారు. ఇకపై జిల్లాలో కేసుల సంఖ్య చెప్పడంతోపాటు.. ఖాళీగా ఉన్న బెడ్స్ వివరాలు కూడా అందించాలని కొవిడ్ నోడల్ అధికారులకు కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. ఈరోజు నుంచే ఈ చర్యలు అమలులోకి రాబోతున్నాయి.

ఇకపై రాష్ట్రంలో ఎక్కడా కరోనా పేషెంట్లు ఆస్పత్రికి వెళ్లేందుకు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు, ఆస్పత్రుల్లో ఖాళీలు లేవని వేచి చూడాల్సిన అగత్యం అంతకంటే ఉండదు. ఆ దిశగా పూర్తిస్థాయిలో జిల్లా కలెక్టర్లను సన్నద్ధుల్ని చేశారు సీఎం జగన్. 

పేషేంట్లకి బెడ్ ఇవ్వలేకపోతే మనం మనుషులమే కాదు