ఈ నెల 23 నుంచి పరిపాలనా రాజధాని విశాఖ నుంచి కొన్ని విభాగాలకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం జగన్ ఒక్క సారి కమిట్ అయితే ఎవరి మాట వినరు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అవసరం ఉందని సూచన ప్రాయంగా చెప్పిన ఆయన అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని, అక్కడికి సచివాలయం తరలి వెళుతుందనే సంకేతాలు రావడమే ఆలస్యం…అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు శరవేగంతో లోలోపల జరుగుతున్నట్టు సమాచారం.
ఒకవైపు రాజధాని రైతుల ఆందోళన మూడో వారానికి చేరింది. అయితే ఆ 29 గ్రామాల రైతులు తప్ప ఇతర ప్రాంతాల నుంచి వారికి ఎలాంటి మద్దతు లభించలేదు. దీంతో జగన్ సర్కార్ కూడా పెద్దగా వారిని పట్టించుకోలేదు. అంతేకాకుండా వారికి మద్దతు పలుకుతున్న టీడీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు పేరుకు పార్టీలు, సంఘాలే తప్ప ప్రజల్లో పలుకుబడి లేనివని జగన్ సర్కార్ భావిస్తోంది. అందుకే వారి పిలుపునకు ఏ ఒక్కరూ స్పందించని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదిక కూడా రావడం, ఆ రెండింటిని పది మంది మంత్రులు, ఇతరత్రా సభ్యులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుండడం చకచకా జరిగిపోతున్నాయి. త్వరలో కేబినెట్ సమావేశమై అమరావతి నుంచి సచివాలయం తరలింపుపై నిర్ణయం తీసుకోనుంది. అదే రోజు అసెంబ్లీలో రాజధానులపై చర్చ, ఆమోదం తెలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే 26న విశాఖలో రిపబ్లిక్ వేడుకల నిర్వహణకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
సచివాలయం తరలింపునకు ఏర్పాట్లు
విడతల వారీగా విశాఖకు సచివాలయం తరలింపునకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. విశాఖలోని మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఐదుశాఖలను తరలించాలని సంబంధిత హెచ్వోడీలకు అనధికారికంగా ఆదేశాలు అందినట్టు సమాచారం.
ముఖ్యంగా హోంశాఖకు సంబంధించి నాలుగు, ఆర్ అండ్‌బీ శాఖ నుంచి నాలుగు, పంచాయతీరాజ్ శాఖ నుంచి నాలుగు సెక్షన్లు, ఆర్థిక, మైనింగ్ శాఖ నుంచి రెండేసి చొప్పున విభాగాలను తరలించనున్నట్టు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖ, ఉన్నత విద్యాశాఖ నుంచి రెండు సెక్షన్లలను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. మనకు అందుతున్న సమాచారం మేరకు 34 శాఖల నుంచి ముఖ్యమైన విభాగాలను తరలించేందుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి.
అయితే కొందరు మినహా సచివాలయ ఉద్యోగులు విశాఖ వెళ్లేందుకు సుముఖంగా ఉండడంతో ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందులు తలెత్తడం లేదు. ఉద్యోగ సంఘం నాయకులు ఇప్పటికే ఉద్యోగులను విశాఖ వెళ్లేందుకు మానసికంగా సమాయత్తం చేశారు.