జగన్‌కు పస్ట్‌క్లాస్‌ మార్కులు.. కాని డిస్టింక్షన్‌ రావాలి

కాలచక్రం గిర్రున తిరుగుతోంది. అప్పుడే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ వందరోజుల పాలన పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆయన వందరోజుల పాలనపై సమీక్షలు, విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ వందరోజుల పాలన అన్నది కేవలం ఒక…

కాలచక్రం గిర్రున తిరుగుతోంది. అప్పుడే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ వందరోజుల పాలన పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆయన వందరోజుల పాలనపై సమీక్షలు, విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ వందరోజుల పాలన అన్నది కేవలం ఒక సూచిక మాత్రమే. అసలు పాలన చాలా ఉంది. ఇంకా నాలుగున్నర సంవత్సరాలపాటు సాగవలసి ఉంది. ఆ తర్వాత ప్రజలు మళ్లీ తమ నిర్ణయం తెలియచేస్తారు. అలా అని ఈ మూడునెలల్లో జరిగిన దానిని విశ్లేషించుకోవడం తప్పుకాదు. నిజానికి ప్రభుత్వంలో ఉన్నవారు ఒకసారి సమీక్షించుకోవడం కూడా మంచిదే. ఈ మూడునెలల పదిరోజులలో ముఖ్యమంత్రిగా జగన్‌ అనేక నిర్ణయాలు చేశారు. వాటిలో జనరంజకమైనవి ఉన్నాయి.

కొన్ని జనానికి ఇబ్బంది కలిగించేవి కూడా ఉండవచ్చు. అయినా స్థూలంగా ప్రజలకు మేలుచేశారా? లేదా? తాను ఎన్నికల ప్రణాళికలో పెట్టిన వాగ్ధానాలను అమలు చేసేదిశలో ఉన్నారా? లేదా? అవినీతి రహితంగా పాలన నడుస్తోందా? లేదా తదితర విషయాలు కీలకం అవుతాయి. నిజానికి అందరిని సమానంగా చూడండి, మా పార్టీ వాళ్లు తప్పు చేసినా చర్య తీసుకోండి అని  ఒక ముఖ్యమంత్రి చెప్పడమే ధైర్యంతో కూడిన పని అని అంగీకరించాలి. గత ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు తమ పార్టీవాళ్లు పనులు అడిగితే చేయాలని, రాజకీయంగా తమకు ఉపయోగం అవ్వాలని కలెక్టర్‌ల సమావేశంలోనే చెప్పారు. అంతేకాదు. చంద్రబాబు తాను మొదటగా సంతకాలు చేసిన వాటిలో ఒక ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసు మినహా ఏవీ సరిగా అమలుకాలేదు.

మరోవైపు జగన్‌ చేసిన సంతకాలు అమలు అవుతున్నాయి. మూడునెలల కాలంలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా ఆయన పాలన సాగించడం గొప్పసంగతి. ప్రస్తుత ఎన్నికల రాజకీయాలలో అలా ఉండగలగడం అంత తేలికైన సంగతికాదు. ఎన్నో ఒత్తిడులను ఆయన ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకరిద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసు అధికారుల బదిలీలలో డబ్బు తీసుకున్నారన్న సమాచారం రావడంతోనే ఆయన వారిని పిలిచి మందలించారని వార్తలు వచ్చాయి. వెంటనే వారు ఆ డబ్బు తిరిగి ఇచ్చేశారని కూడా అంటారు. ఈ మద్యకాలంలో ఇలాంటివి వినడం ఇదే అనిచెప్పాలి. మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తామని చెబుతూ ముందుగా 800 షాపులు తగ్గించారు. ప్రభుత్వమే షాపులను నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు.

వృద్దాప్య పెన్షన్లు రెండువేల నుంచి 2250 రూపాయలకు పెంచి అమలుచేయడం ఆరంభించారు. ఆశావర్కర్ల జీతాలు పెంచారు. రైతుబరోసా, అమ్మఒడి వంటి వాటిని అమలు చేయడానికి షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు. ఇలా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నది వాస్తవం, రివర్స్‌ టెండరింగ్‌, ప్రభుత్వ పదవులు, కాంట్రాక్టులలో ఏభైశాతం బలహానవర్గాలకు కేటాయిస్తూ చట్టం తీసుకురావడం, స్థానికులకు డెబ్బై ఐదుశాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టంతేవడం ఇలా మానిపెస్టోలని అంశాలపై చర్యలు తీసుకున్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మ్యానిపెస్టోని తనతో సహా మంత్రుల వద్ద, అధికారుల వద్ద పెట్టి వీటిని అమలు చేయాలని చెప్పి జగన్‌ కొత్త అద్యాయానికి శ్రీకారం చుట్టారు.

గతంలో ఏ ప్రభుత్వం ఇంత ధైర్యంగా ఇలా చేయలేదు. గత టర్మ్‌లో పాలించిన టీడీపీ అయితే తన మ్యానిఫెస్టోని పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తీసేసింది. ఎందుకంటే అందులో కొన్ని వందల ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చింది కనుక. వాటిని ఆయా రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రశ్నిస్తారని ఆ విధంగా చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఓకే చేయడం కూడా సంచలనమే. ప్రత్యేకహోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ తీర్మానం చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారంచుట్టారు. ఇది కొత్త ప్రయోగం. ఇది సజావుగా జరిగితే ఓకే. లేకుంటే కొత్త సమస్యలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాంతాలలో సూపర్‌ స్పెషాటిలి ఆస్పత్రులు నెలకొల్పడం, పలాసలో డయాలిసిస్‌ కేంద్రం, 200 పడకల ఆస్పత్రి ఏర్పాటు తధితర నిర్ణయాలు చేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బు చెల్లించాలని కూడా తీర్మానం చేశారు. అయితే నిర్ణయాలు జరిగినంత మాత్రాన ఇవన్ని అయిపోతాయని కాదు.. ఇందుకు చాలా డబ్బు కావాలి. నలభై ఏళ్ల పరిశ్రమ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఖజానాలో వంద కోట్లు మాత్రం మిగిల్చివెళ్లారు. అంతేకాక లక్షన్నరకోట్ల అప్పు కూడా పెట్టి వెళ్లారు. ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులు కూడా జరగాలి. ఎక్కడా సమతుల్యత దెబ్బతినకూడదు. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి, అక్రమాలపై కమిటీలు వేసి నివేధికలు తెప్పిస్తున్నారు. వాటిపై ఎంతవరకు ముందుకు వెళతారో తెలియదు కాని వాటిలోని అంశాలు, గత ఐదేళ్లలో జరిగిన అవినీతి అందరికి దిగ్బ్రమ కలిగించేవే.

పోలవరం ప్రాజెక్టులో 2300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ తేల్చింది. దాని ఆధారంగా కాంట్రాక్టును రద్దుచేశారు. అయితే దీనిపై కేంద్రంలో టీడీపీ మేనేజ్‌ చేయడం వల్లకాని, ఇతరత్రా కాని కొంత వ్యతిరేక వ్యాఖ్యలు రావడం ఏపీ ప్రభుత్వానికి చికాకు కలిగించేదే. హైకోర్టు కూడా అనుకూల తీర్పు ఇవ్వలేదు. అయినా అదే క్రమంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నవంబర్‌ ఒకటి నుంచి పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషి వల్ల ఆరంభమైన ఈ ప్రాజెక్టు ఏపీకి ఎంతో కీలకం. అంతేకాదు.. జగన్‌కు కూడా ప్రతిష్టాత్మకం. రివర్స్‌ టెండరింగా? మరొకటా అన్నది ఇక్కడ ప్రజలకు అప్రదానం. అంతా కోరుకునేది ప్రాజెక్టు పూర్తికావడం అన్న సంగతిని జగన్‌ గుర్తించాలి.

సకాలంలో ప్రాజెక్టు పూర్తికాకపోతే జగన్‌కు రాజకీయంగా నష్టం జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోరాదు. పలు ప్రాజెక్టు పనుల టెండర్లలో అవినీతిని దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా రద్దుచేసి రివర్స్‌ టెండరింగ్‌కు వెళుతునారు. మరొక ముఖ్యమైన అంశం రాజధాని.. దానిపై ప్రతిపక్షం ఎంత రాద్ధాంతం చేస్తోందో చూస్తున్నాం. మునక ప్రాంతంలో రాజధాని భవనాల నిర్మాణం ప్రారంభించిన మాట వాస్తవం. దానిని చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా చూశారన్నది నిజం. అన్ని నగరాలు ఒకేచోట అంటూ కేంద్రీకృతం అవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నచ్చలేదు. పవన్‌కళ్యాణ్‌ వంటివారు ఈ విషయంలోమాట మార్చి ఉండవచ్చు. అయితే రాజధానిని మార్చుతారని ఎవరూ అనుకోవడం లేదు. ఇది రాష్ట్ర ప్రజల నెత్తిన ఒక పెద్ద కొండగా మారింది.

ప్రభుత్వానికి గుదిబండగా ఉంది. దానిని పట్టుకుని కూర్చోలేరు. తీసేయలేరు. కాని ఏదో ఒక విధానంతో ముందుకు వెళ్లాలి. ఏభైవేల ఎకరాలలో రాజధాని కడతానని ఎవరు చెప్పినా అది తెలివి తక్కువ తనమే అవుతుంది. అయితే ఎటూ భూములు తీసుకున్నారు కాబట్టి వాటిని ఎలా వాడుకోవాలన్న దానిపై ఆలోచన జరగాలి. అందుకోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేయడం సాధ్యం కాకపోవచ్చు. కాని మినిమమ్‌ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు  చేయడం బెటర్‌. అలాగే గత ప్రభుత్వం ప్లాన్‌ చెసిన స్పోర్స్ట్‌ సిటీ, హెల్త్‌సిటీ, అంటూ రకరకాల నగరాల కాన్సెప్ట్‌లను ఇతర జిల్లాలకు కూడా మార్చి అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగేలా చూడాలి. ఇక మీడియా పరంగా జగన్‌ ప్రభుత్వం పెద్ద శ్రద్ద తీసుకుంటున్నట్లు కనపడడం లేదు.

గతంలో మాదిరే తెలుగుదేశం మీడియా ఆయనపై ఎక్కడ అవకాశం వచ్చినా వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నిస్తోంది. టీడీపీ వారి విమర్శలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇసుక విషయంలోనే ప్రభుత్వం ఎక్కువ విమర్శలు ఎదుర్కుంది. అయితే కొత్త ఇసుక విధానం అమలులోకి వచ్చినందున ఆ సమస్య తొలగిపోవచ్చు. కాగా జగన్‌ ఇతరపక్షాల నేతలకు, ప్రజా ప్రతినిధులకు ఇంకా అప్పాయింట్‌ మెంట్‌లు ఇవ్వడం లేదని, ప్రజలను కలుసుకునే ఏర్పాటు జరగలేదన్న వ్యాఖ్యలు ఉన్నాయి. కొద్దిరోజులలో మొదలైతే అవి కూడా తగ్గుతాయి. తెలంగాణతో సఖ్యత, కేంద్రంతో సత్సంబంధాలు, కేసీఆర్‌, మోడీలతో స్నేహం ఇవన్ని సానుకూల అంశాలే. అయితే ప్రాంతీయ భావాలు, మతపరమైన అంశాలు ఎంతో సున్నితమైనవి.

ప్రత్యర్థులు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని కాచుకు కూర్చున్నారు. దానికి ఉదాహరణ ఆర్టీసి బస్‌ టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం వ్యవహారమే. అది చేసింది టీడీపీ హాయంలో అయినా జగన్‌ ప్రభుత్వానికి బురదరాసే ప్రయత్నం జరిగింది. స్థూలంగా చూస్తే జగన్‌ ఈ మూడునెలల్లో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యారని అంగీకరించవచ్చు. కాని ప్రజలు ఆయన డిస్టింక్షన్‌లో ఉండాలని అభిలాషిస్తారు. కనుక సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో చేసుకుంటూ ముందుకు వెళ్లడానికి ఈ మూడునెలలు ఆయన పునాధి వేసుకున్నారని అనుకోవాలి. ఈ పునాధి బాగా బలపడి, ప్రజలలోకి ఈ ఫలాలు వెళ్లడం మొదలైతే, అప్పుడు జగన్‌ డిస్టింక్షన్‌ మార్కులు వస్తాయి.
-కొమ్మినేని శ్రీనివాసరావు

జగన్ 100 రోజుల పాలనపై 'గ్రేట్ ఆంధ్ర' పేపర్ ప్రత్యేక కథనం