తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా విద్య వ్యాపారంగా మారి చాలా ఏళ్లవుతోంది. తల్లిదండ్రుల అమాయకత్వమే కార్పొరేట్ విద్యా మాఫియా పెట్టుబడి, పిల్లల ర్యాంకులే వారికి పరమావధి. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేక, ర్యాంకుల టార్గెట్లు అందుకోలేక ఎన్నో బలవన్మరణాలు. అవన్నీ, కార్పొరేట్ విద్యా మాఫియా ఖాతాలోకే వెళ్తాయి.
అయినా తల్లిదండ్రులకు మరో మార్గం లేదు, ర్యాంకుల పనిముట్టుగా తమ పిల్లల్ని తీర్చిదిద్దాలంటే కార్పొరేట్ కొలిమిలో కాల్చి కాల్చి హింసించక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఓ చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇదీ మా ప్రత్యేకత అని చెప్పుకోడానికి ఏదీ కార్పొరేట్ కి మిగల్చకుండా చెక్ పెడుతోంది.
అత్యాధునికమైన క్యాంపస్, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్.. ఇలా సాగుతుంది కార్పొరేట్ విద్యా ప్రచారం. ఇప్పుడు అవన్నీ కూడా ప్రభుత్వ స్కూళ్ల వశమయ్యాయి. కేవలం ఇంగ్లిష్ మీడియం కోసమే పేదపిల్లలు కూడా కాన్వెంట్ చదువులకు వెళ్తున్నారనేది అందరికీ తెలిసిన సత్యం. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడితే మాత్రం కుదరదంటారు. ఇన్నాళ్లూ ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసం జగన్ చేశారు. ఇంగ్లిష్ మీడియం కోసం కోర్టులతో పోరాడుతున్నారు.
కార్పొరేట్ కాలేజీల రెండో ప్రధాన అస్త్రం సీబీఎస్ఈ సిలబస్. ఈ సిలబస్ లో చదివితేనే విద్యార్థులకు అవగాహన సామర్థ్యం పెరుగుతుందని, అలాంటివారికే ఐఐటీ, ఐఐఎంలలో సీట్లు వస్తాయని, నీట్ లో ర్యాంకులు వస్తాయని ఓ ప్రచారం ఉంది. అందుకే మా స్కూల్ లో సీబీఎస్ఈ సిలబస్ అంటూ అదో గొప్పగా ప్రచారం చేసుకుంటాయి ప్రైవేట్ యాజమాన్యాలు.
ఇప్పుడా అవకాశానికి కూడా గండి కొడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో కూడా సీబీఎస్ఈ బోధనకు వైసీపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది 1 నుంచి 7 వరకు, వచ్చే ఏడాది మరో తరగతి, ఆ పై ఏడాది ఇంకో తరగతి.. అలా పెంచుకుంటూ మరో మూడేళ్లకు ప్రభుత్వ స్కూళ్లు అన్నిట్లో సీబీఎస్ఈ బోధన అమలులోకి వస్తుందన్నమాట.
ప్రభుత్వ స్కూళ్లలో పూర్తి స్థాయిలో ఈ విధానం అమలులోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలిచిపోవడం ఒక ఎత్తయితే.. సీబీఎస్ఈ సిలబస్ లోకి మారడంతో ఇంగ్లిష్ మీడియానికి ఎవరూ వంక పెట్టకుండా చేయడం మరో ఎత్తు. సీబీఎస్ఈ సిలబస్ మార్చారంటే, కచ్చితంగా ఇంగ్లిష్ మీడియం కు ఓకే చెప్పినట్టే లెక్క. అంటే ఇకపై ఇంగ్లిష్ మీడియంపై కూడా న్యాయవివాదాలు ఉండే అవకాశమే లేదు.
ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తారా..?
ప్రైమరీ సెక్షన్ అక్కడా ఉంది, ఇక్కడా ఉంది.
ఇంగ్లిష్ మీడియం అక్కడా ఉంది, ఇక్కడా ఉంది.
సీబీఎస్ఈ సిలబస్ అక్కడా ఉంది, ఇక్కడా ఉంది.
నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రైవేటుకి ధీటుగా బిల్డింగ్ లు, మరుగుదొడ్లు ఉన్నాయి..
అదనంగా..
సుశిక్షితులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్ల సొంతం.
యూనిఫాం, బ్యాగ్, షూస్, టై.. అన్నీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది.
మంచి ఆటస్థలాలు ఉంటాయి.
మధ్యాహ్నం ఉచిత భోజనం లభిస్తుంది.
ఇన్ని సమకూర్చినా కూడా, ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కి ఏపీలో చిరునామా ఉంటుందని ఎవరూ ఊహించరు. జగన్ దెబ్బకి ఇప్పుడు కాకపోయినా, మరో రెండేళ్లకైనా ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ పూర్తిగా కనుమరుగైపోవడం ఖాయం. అలా ఫీజుల పేరుతో జరిగే కార్పొరేట్ విద్యా దోపిడీకి ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెంచి పరోక్షంగా చెక్ పెట్టేశారు జగన్.
చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి