ప్రజా సంకల్పానికి నాలుగేళ్లు.. చెక్కుచెదరని రికార్డ్

జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సరిగ్గా నాలుగేళ్లు. 2017 నవంబర్ 6న దివంగత నేత వైఎస్ఆర్ సమాధి వద్ద ఇడుపుల పాయలో మొదలైన యాత్ర.. ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజులు, 3648 కిలోమీటర్లు.. ఇది…

జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సరిగ్గా నాలుగేళ్లు. 2017 నవంబర్ 6న దివంగత నేత వైఎస్ఆర్ సమాధి వద్ద ఇడుపుల పాయలో మొదలైన యాత్ర.. ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజులు, 3648 కిలోమీటర్లు.. ఇది ఆయన ట్రాక్ రికార్డే కాదు, ఆల్ టైమ్ రికార్డ్. అవును.. ఆ స్థాయిలో నిరంతరాయంగా పాదయాత్ర చేయడం ఎవరి వల్లా కాదు, కాలేదు కూడా.

కొంతదూరం నడిచి, మరికొంతదూరం వాహనంలో వెళ్లడం, గెస్ట్ హౌస్ లు, ఏసీ రూముల్లో సేదతీరడం అందరూ చేసేదే. కానీ జగన్ సంకల్పం అలాంటిది కాదు. అంతా కాలినడకే. ముళ్లదారులున్నా, గతుకుల రోడ్లయినా జనంతోనే, జనం వెంటే. ఎక్కడికక్కడ స్థానికంగా బస ఏర్పాటు చేసుకున్నారు. ఉక్కు సంకల్పంతో ముందుకు నడిచారు. మరి అలాంటి ఉక్కు సంకల్పం సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎంతమందికి ఉంది.

పాదయాత్ర వల్లే జగన్ కి అధికారం వచ్చిందని చెప్పలేం కానీ.. సంకల్ప యాత్ర వల్ల జగన్ జనానికి బాగా చేరువయ్యారనేది మాత్రం నిజం. జగన్ ని తమవాడిగా చూసుకున్నారు, తమ కోసం వచ్చాడని కష్టాలు చెప్పుకున్నారు. ఆ కష్టాలు తీరుస్తారని ఘన విజయం అందించారు. వైసీపీకి అధికారం దక్కడంలో ప్రజా సంకల్ప యాత్రదే ఎక్కువ భాగం.

పవన్ చేయగలరా.. లోకేష్ సాహసం చేస్తారా..?

మరిప్పుడు అధికారం కోసం అర్రులు చాస్తున్న లోకేష్, పవన్ ఆ సాహసం చేస్తారా..? 4 రోజులు రాజకీయాలు, వారం రోజులు సినిమాలు అంటూ లెక్కలేసుకునే పవన్ తన 341 రోజుల కాల్షీట్లను ప్రజల కోసం ఖర్చు పెట్టగలరా..? పవన్ కి ఆ ఓపిక, తీరిక రెండూ లేవు. చంద్రబాబు వయోభారంతో ఎలాగూ యాత్రలకు సాహసం చేయలేరు, మరి చినబాబు సంగతేంటి..?

లోకేష్ సైకిల్ యాత్ర అంటూ ఇప్పటికీ ఫీలర్లు వస్తూనే ఉన్నాయి. కానీ  ఆ సైకిల్ కి ఇంకా పంచర్లు వేసుకుంటున్నారు, రిపేర్లు చేసుకుంటున్నారు కానీ ట్రాక్ పైకి మాత్రం తేలేదు. లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే అదే పదివేలు అని స్థానిక నాయకులనుకుంటున్నారు. అలాంటి చినబాబుకి రాష్ట్రం మొత్తం చుట్టివచ్చేంత ధైర్యం లేదు.

అంటే జగన్ చరిత్రను తిరగరాయాలంటే మళ్లీ జగనే రావాలి. ప్రజా సంకల్పం అనేది జగన్ కి మాత్రమే సొంతం. అది ఎప్పటికీ చెక్కుచెదరని రికార్డే.