మరోసారి వాయిదాపడిన ప్రతిష్టాత్మక కార్యక్రమం

జగనన్న విద్యాకానుక పథకం మరోసారి వాయిదా పడింది. అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ పథకం ప్రారంభాన్ని మరోసారి వాయిదా వేశారు. రేపు జరగాల్సిన ఈ కార్యక్రమం…

జగనన్న విద్యాకానుక పథకం మరోసారి వాయిదా పడింది. అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ పథకం ప్రారంభాన్ని మరోసారి వాయిదా వేశారు. రేపు జరగాల్సిన ఈ కార్యక్రమం మరోసారి వాయిదాపడింది.

అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్.. చెప్పినట్టుగానే ఒక్కొక్కటిగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి ప్రైవేట్ స్కూళ్లకు చెక్ పెట్టారు. అమ్మఒడితో డ్రాపవుట్స్ తగ్గించే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. సవరించిన మెనూతో మరింత పౌష్టికాహారాన్ని అందించబోతున్నారు.

ఇదే ఊపులో జగనన్న విద్యాకానుకను కూడా ప్రవేశపెట్టాలని భావించారు ముఖ్యమంత్రి. అయితే కరోనా పరిస్థితుల వల్ల ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదాపడుతూనే ఉంది. జూన్ లో పాఠశాలలు ప్రారంభంకాగానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలనుకున్నారు. కరోనా వల్ల నవంబర్ 2 నుంచి పాఠశాలలు తెరవబోతున్నారు. 

ఈ నేపథ్యంలో కాస్త ముందుగానే విద్యాకానుక కిట్లు అందిస్తే, పిల్లలకు అనువుగా ఉంటుందని భావించారు. ఈ మేరకు విజయవాడ దగ్గర ఉన్న కంకిపాడులోని ఓ స్కూల్ లో ఈ పథకాన్ని అధికారికంగా రేపు ప్రారంభించాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల దాన్ని వాయిదా వేశారు.

విద్యాకానుక కింద 3 జతల యూనిఫామ్, నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఒక జత షూ, 3 జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ను విద్యార్థులకు ఉచితంగా అందించబోతున్నారు. దీని కోసం ప్రభుత్వం 650 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది.

ఈ పథకం మళ్లీ ఎప్పుడు ప్రారంభమౌతుందనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అయితే పాఠశాలలు తెరిచేలోపే విద్యాకానుక కిట్ అందించడం మాత్రం పక్కా అంటున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు, విద్యార్థులకు సరిపడ కిట్స్ సిద్ధంగా ఉన్నాయంటున్నారు అధికారులు. 

హ‌రిబాబుకు అంతేనా