జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక్కోసారి ప్రాక్టికల్‌గా ఉంటున్నాయి. ఓసారి కాస్త అపరిపక్వంగా ఉంటున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు ఓటములపై విశ్లేషించుకోవడం అవసరమే. నలభై ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో అర్థంకావడం లేదని అన్నట్లుగా కాకుండా గెలుపు, ఓటములను సమానంగా చూస్తానని పవన్‌కళ్యాణ్ చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కాని ప్రజలు ఓట్లు అమ్ముకున్నారని ఆయన అన్నారని వార్తలు వచ్చాయి. అవి నిజమే అయితే పవన్‌కళ్యాణ్ కూడా పార్టీ ఓటమిని అర్థం చేసుకోలేకపోయారని అనుకోవాలి.
నిజమే ఎన్నికల వ్యయం పెరిగినమాట నిజం. అయితే అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కే వర్థిస్తుందని, మిగిలిన పార్టీలకు వర్థించదని పవన్‌కళ్యాణ్ అనుకుంటే ఆయన నిజాలు మాట్లాడడంలేదని అనుకోవచ్చు. పవన్‌కళ్యాణ్ భీమవరం, గాజువాకలలో రెండుచోట్ల పోటీచేశారు. ఆయన ఎంత ఖర్చుచేసింది ఆత్మసాక్షిగా చెప్పగలరా? ఆయనే కాదు.. ఆయన పార్టీకి చెందిన మరికొంతమంది.. ఆ మాటకువస్తే ఆయన సోదరుడు నాగబాబు కూడా పోటీచేశారు కదా.. వాస్తవ పరిస్థితి ఏమిటో తెలిసిఉండాలి కదా.. అలాకాకుండా ఆత్మవంచన చేసుకునేలా మాట్లాడితే ఏమిచెప్పగలం?
పవన్‌కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన అభిమానులకు ఎంతో ఉత్సాహం ఉండేది. దానిని ఆయన తెలుగుదేశం పార్టీ విజయానికి పెట్టుబడిగా మార్చేశారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో గెలిచి సొంతంగా అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. కాని పవన్‌కళ్యాణ్ మాత్రం టీడీపీ కోసమే పార్టీ పెట్టినట్లుగా అప్పట్లో వ్యవహరించారు. అప్పుడే ప్రెష్‌గా మళ్లీ పార్టీ పెట్టడం, ఒకటి, రెండు సినిమాలు హిట్ అయిన నేపథ్యం అవన్ని కలిసివచ్చి టీడీపీ విజయానికి ఉపయోగపడ్డాయి.
కాని ఆ తర్వాత కాలంలో ఆయన టీడీపీ ప్రభుత్వం చేసిన అనేక అరాచకాలను ప్రశ్నించడంలో విఫలం అయ్యారు. తాను ప్రశ్నించడానికి వచ్చానని చెప్పడమే కాని, చేసింది తక్కువ. రాజధాని విషయంలో గ్రామాలలో ధర్నా చేయడం, ఆ తర్వాత చంద్రబాబుతో రాజీపడిపోవడం ఆయనకు అప్రతిష్ట తెచ్చిపెట్టింది. తదుపరి గుంటూరులో పవన్ కళ్యాణ్ ఒక భారీ సభపెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఒక్కసారిగా ఆయన అభిమానులలో మళ్లీ ఉత్సాహం పెల్లుబుకింది. కాని దానిని నిలబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ విఫలం అయ్యారు.
ఆయన పోరాట యాత్రలని, అవని, ఇవని చేసినా ఒక స్థిరమైన అభిప్రాయాలు లేకపోవడం, ఉపన్యాసాలలో క్లారిటీ లేకపోవడం, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కాకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ను విమర్శించడం వంటివాటితో ఆయనపై మళ్లీ ప్రజలలో అనుమానాలు వచ్చాయి. పవన్‌కళ్యాణ్ ఒకమాట అన్నారు. పాతికేళ్లు రాజకీయం చేయడానికి వచ్చానని అన్నారు. అలాగే తన వద్దకు వచ్చి జైకొట్టి వైసీపీ, టీడీపీలకు మద్ధతు ఇచ్చారని కూడా ఆయన పార్టీ నేతల సమీక్షలలో అన్నారు. ఈ ఒక్క పాయింట్ చాలు. ఆయన తన ఓటమికి కారణం అర్థం చేసుకోవడానికి.
నిజంగానే జనసేన గెలిచే పరిస్థితి ఉంటే వారు అలా ఎందుకు చేస్తారు? ఇప్పుడు కూడా జనం ఓట్లు అమ్ముకున్నారని అందువల్లే తమ పార్టీ ఓడిపోయిందని పవన్ కళ్యాణ్ భావిస్తుంటే అంతకన్నా తప్పు మరొకటి ఉండదు. అది జనాన్ని, జనం విజ్ఞతను అవమానించినట్లే అవుతుంది. నిజానికి ఏదైనా పార్టీ ఓడిపోవడంలో ఆ పార్టీ అధినేతకే ఎక్కువ భాద్యత ఉంటుంది. ఆ విషయాన్ని విస్మరించి రాజకీయం సాగిస్తే ఆత్మవిమర్శ చేసుకోలేదని అర్థం.
పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల సమీక్షలు చేసుకునే ముందు తనను తాను ఆత్మ పరిశీలన చేసుకుని ఎక్కడ లోపాలు జరిగాయి? ఎందువల్ల ఇంత ఘోరమైన ఓటమికి గురికావాల్సి వచ్చిందన్న దానిపై అవగాహన రాగలగాలి. బీజేపీకి ఒక్కశాతం కూడా రాలేదు. తనకు ఆరుశాతం ఓట్లు వచ్చాయని సంతృప్తి చెందితే పార్టీ అడుగు ముందుకు వేయడం కష్టమే అవుతుంది. నిజమే ఈలలు, గోలలతో పార్టీ అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే కేవలం సినిమా డైలాగులు, సమీక్షలతోనే రాజకీయం చేయడం కూడా ఎప్పటికి ఫలితాలలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చన్న సంగతి కూడా ఆయన తెలుసుకోవాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు