జనంలోకి జనసేనాని.. నమ్మొచ్చా.?

ఇకపై నిత్యం ప్రజల్లోనే వుండాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, పార్టీ ముఖ్య నేతలకు 'గెలుపు మంత్రం' ఉపదేశించారట. ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిన దరిమిలా, రాజకీయ తెరపై…

ఇకపై నిత్యం ప్రజల్లోనే వుండాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, పార్టీ ముఖ్య నేతలకు 'గెలుపు మంత్రం' ఉపదేశించారట. ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిన దరిమిలా, రాజకీయ తెరపై నుంచి దాదాపుగా జనసేన పార్టీ అటకెక్కిపోయినట్లేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే, పవన్‌ కళ్యాణ్‌ మాత్రం.. రాజకీయాల్లోకి వచ్చింది, ఎన్నికలయిపోగానే దుకాణం సర్దేయడానికి కాదు.. ఓటమితోనే కుంగిపోయేందుకు కాదు.. అంటున్నారు. 

సరే, 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్‌ కళ్యాణ్‌ 2019 ఎన్నికల దాకా ఏం చేశారు.? ఎంత కాలం జనంలో వున్నారు.? ఎంతలా జనం కోసం పోరాడారు.? అన్నది జనానికే బాగా తెలుసు. చంద్రబాబు విషయంలో సుతిమెత్తగా వ్యవహరించి, వైఎస్‌ జగన్‌ విషయంలో తోక తొక్కిన తాచులా బుసకొట్టి.. సినీ నటుడిగా తనకున్న ఇమేజ్‌ని సైతం పవన్‌ కళ్యాణ్‌ చెడగొట్టుకున్నారన్నది నిర్వివాదాంశం. 

ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలకు క్లాసులు తీసుకోవడం కాదు.. రానున్న రోజుల్లో పార్టీ అధినేతగా తానెలా వ్యవహరించబోతున్నానన్నదానిపై పవన్‌ కళ్యాణ్‌ వివరణ ఇచ్చుకోవాల్సి వుందిక్కడ. ప్రజల్లో నిత్యం పవన్‌ కళ్యాణ్‌ వుంటారా.? ప్రజా సమస్యల పట్ల పోరాడతారా.? లేదంటే, 2024 ఎన్నికల్లో చూసుకుందాం.. అంటూ అప్పటిదాకా టైమ్‌ పాస్‌ చేసేయబోతున్నారా.? జనసేనాని, జనసేన శ్రేణులకు ఈ ప్రశ్నలపై వివరణ ఇచ్చి తీరాల్సిందే. 

పోటీ చేసిన రెండు చోట్లా పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోయారు ఇటీవలి ఎన్నికల్లో. 'రెండు చోట్లా గెలిచేస్తా..' అన్న అత్యుత్సాహమే పవన్‌ కళ్యాణ్‌ కొంప ముంచేసింది. చాలా ఈక్వేషన్స్‌ చూసుకుని, నియోజకవర్గాల్ని పవన్‌ ఎంచుకున్నా.. ఇక్కడ టైమింగ్‌ దెబ్బకొట్టేసింది. పైగా, ఎన్నికల వేళ కూడా చంద్రబాబుతో అంటకాగి.. జనసేన విజయావకాశాల్ని (కాస్తో కూస్తో అయినా) స్వయానా పవన్‌ కళ్యాణ్‌ చెడగొట్టారన్నది నిర్వివాదాంశం. 

ఇకనైనా, పవన్‌ కళ్యాణ్‌ క్లీన్‌ పాలిటిక్స్‌ చేస్తారో.. లేదంటే గతంలోలా దబిడి దిబిడి రాజకీయం చేస్తారో.. వేచి చూడాల్సిందే మరి.