బీజేపీ, జనసేన ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయనే వార్త అందరికీ తెలిసిందే. పొత్తు కుదుర్చుకున్న కొత్తల్లో ఉన్న హుషారు ఇప్పట్లో లేదు. పైపెచ్చు ఎవరికి వారే సొంత పాపులార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఉమ్మడి కార్యాచరణ ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఓవైపు జాబ్ క్యాలెండర్ నిరసన పేరుతో జనసేన హడావిడి చేస్తే, ఏపీ బీజేపీ నేతలు కేంద్ర మంత్రుల్ని కలుస్తూ తమ ఉనికి చాటుకోడానికి ట్రై చేస్తున్నారు. వచ్చే ఎన్నికలనాటికి రెండు పార్టీలు వేరుదారులు పడటం మాత్రం ఖాయం.
జనసేనతో ఉపయోగం లేదా..?
జనసేనతో తమకి ఏమాత్రం ఉపయోగం లేదని అంచనా వస్తోంది బీజేపీ. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో జనసేన సత్తా ఏంటో బీజేపీకి బాగా తెలిసొచ్చింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం మేమేనంటూ బీరాలు పలుకుతున్నా కూడా.. ఏ దశలోనూ టీడీపీకి పోటీనివ్వలేకపోతోంది.
ఏపీలో టీడీపీ పరిస్థితి కూడా రోజురోజుకీ దిగజారుతుందనుకోండి, అయితే అంతకంటే దిగజారిపోతోంది బీజేపీ. పవన్ మూడ్ బాగుంటే రాజకీయాలు చేస్తారు. మారితే సినిమాలంటారు. బీజేపీ నేతలకు ఇది మింగుడుపడటంలేదు.
ఆయనతో కలసి అధికారం సంపాదించడం అనేది కల్ల అని ఏపీ బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు. అందుకే పవన్ తో మొదట్లో రాసుకుపూసుకుని తిరిగిన వీర్రాజు సైతం ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఈ ఎడబాటు మరింత ఎక్కువైంది.
బీజేపీతో మనకు పనేంటి..?
ఏపీలో అయినా, తెలంగాణలో అయినా ప్రతిసారీ జనసేన త్యాగాలకే పరిమితం అవుతోంది. బీజేపీ మాత్రం తన అభ్యర్థుల్ని బరిలో దింపి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. దీంతో తెలంగాణలో అసలు పార్టీని నడపలేననే స్థితికి వచ్చారు పవన్ కల్యాణ్.
ఇటు ఏపీలో గాజు గ్లాసు గుర్తుకి కూడా ఎసరు తెచ్చుకున్నారు. ఈ దశలో అసలు బీజేపీతో మనకేంటి ఉపయోగం అని ఆలోచిస్తున్నారు జనసైనికులు. ఒంటరిగా పోరాటాలు చేసుకుంటున్నారు.
జాబ్ క్యాలెండర్ విషయంలో బీజేపీ నాయకుల్ని దగ్గరకు రానివ్వలేదు. ఓ దశలో టీడీపీ, జనసేన పోటీ పోటీగా నిరసనలు చేపట్టి హడావిడి చేశాయి కానీ, బీజేపీతో మాత్రం కలవలేకపోయింది జనసేన.
ఏపీ బీజేపీ సెల్ఫ్ ప్రమోషన్..
గతంలో ఎప్పుడూ ఏపీ సమస్యలపై పెదవి విప్పని బీజేపీ నేతలు ఇప్పుడు హఠాత్తుగా కేంద్ర మంత్రుల్ని కలుస్తూ సెల్ఫ్ ప్రమోషన్ మొదలు పెట్టారు.
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరత ఉన్నా వారి నోళ్లు తెరుచుకోలేదు, కనీసం వ్యాక్సిన్ కేటాయింపుల్లో కనికరం చూపించండి అని అడగడానికి కూడా వారికి మనసు రాలేదు, విశాఖ ఉక్కు విషయంలో డబుల్ గేమ్ ఆడారు.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు వినతిపత్రాలిస్తూ బిల్డప్ ఇస్తున్నారు.
పోలవరం పూర్తి చేయడానికి సహకరించండి, రాయలసీమ ఎత్తిపోతలకు న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమాలకు జనసేన నేతలకు ఆహ్వానం లేదు.
రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టే ఉద్యమాలైనా, నిరసనలైనా, ఇచ్చే వినతి పత్రాలైనా.. రెండు పార్టీలు కలసి చేస్తేనే వాటికి మరింత బలం ఉంటుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్ని చూస్తే మాత్రం జనసేన, బీజేపీ విడాకులు ఖాయం అని తేలుతోంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ పెటాకుల వ్యవహారం మరింత రంజుగా మారే అవకాశం ఉంది.