రాజకీయాల్లో విమర్శలు చేయడం మంచిదే కానీ. అవి మరీ వింతగా విడ్డూరంగా ఉంటేనే ఇబ్బంది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉండడం విపక్షాలలో కొన్నింటికి నచ్చడంలేదు అన్నది తెలిసిందే. జగన్.. ముఖ్యమంత్రి ఈ రెండు పదాలను కలిపి చదవడం కూడా వారికి చాలా కష్టంగా ఉంది.
అలాగని జనాభిప్రాయాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు కదా. ప్రజాస్వామ్య స్పూర్తిని గౌరవిస్తే దాని ద్వారానే ఎవరైనా కూడా మళ్ళీ రేపటి పదవులు అందుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అయితే జగన్ సీఎం అయ్యాకే ఏపీకి సమస్యలు అన్నీ వచ్చాయని అంటున్నారు. ఈ సమస్యలు మునుపెన్నడూ లేవని కూడా ఆయన చెబుతున్నారు.
అంటే జగన్ వస్తూనే తాను సమస్యలను వెంట తెచ్చారా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే కరోనా వంటి సమస్యలు మాత్రం మునుపెన్నడూ లేవు, అది జగన్ తీసుకురాలేదు కూడా. మరి ఆ సమస్యనూ జగన్ ఖాతాలో వేస్తారా అన్న డౌట్లు కూడా వైసీపీ వారికి వస్తున్నాయట.
ఏపీ ఏడేళ్ల క్రితం విడిపోయినపుడే సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటిని ప్రస్తుత ప్రభుత్వం సరిచేస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే జనసేన నేతలు మాత్రం జగన్ తోనే సమస్యలు అంటున్నారు.
మొత్తానికి వస్తే వారికి సమస్యలతో పోరాటం అయితే బాధ లేదు కానీ జగనే వారికి సమస్య అయితే మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు అంటూ సెటైర్లు మాత్రం పడుతున్నాయి.