పవన్ షూటింగ్స్ పై నాదెండ్ల కవరింగ్

పవన్ కల్యాణ్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఈరోజు మరో సినిమా కూడా స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో రైతు పరామర్శ యాత్రలు చేసిన పవన్, ఆ తర్వాత ఒక రోజు దీక్షతో దానికి చరమగీతం…

పవన్ కల్యాణ్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఈరోజు మరో సినిమా కూడా స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో రైతు పరామర్శ యాత్రలు చేసిన పవన్, ఆ తర్వాత ఒక రోజు దీక్షతో దానికి చరమగీతం పాడేసి, ఎంచక్కా మేకప్ వేసుకున్నారు.

జై అమరావతి అంటారే కానీ, ఆ నిరసనల వార్షికోత్సవానికి కూడా వెళ్లలేనంత బిజీ అయ్యారు. సేమ్ టైమ్, దిల్ రాజు బర్త్ డే పార్టీలో గడిపారు జనసేనాని. తాజాగా దివీస్ అంశాన్ని జనసేన రాజకీయం చేయాలనుకుంటోంది. 

బాధితుల పక్షాన పోరాడతామంటూ జనసేన నెంబర్-2 నాదెండ్ల మనోహర్ ఆవేశంగా హామీ ఇచ్చారు. అయితే ఇక్కడే ఆయన చిన్న కండిషన్ పెట్టారు. ప్రభుత్వానికి 10 రోజుల టైమ్ ఇస్తాం, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే జనసేనాని రంగంలోకి దిగుతారంటూ హెచ్చరించారు.

ఇంతకీ ఆ 10 రోజుల టైమ్ ఎందుకిచ్చారో అయ్యగారు సెలవివ్వలేదు. పవన్ 10 రోజుల కాల్షీట్లు దిల్ రాజు వద్ద మిగిలే ఉన్నాయని, ఈలోగా ఆయన వకీల్ సాబ్ షూటింగ్ నుంచి రావడం కష్టమని, అందుకే ఆయన 10 రోజుల డెడ్ లైన్ పెట్టారని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. 

నిజంగా దివీస్ పరిశ్రమ ఏర్పాటు ఓ సమస్యే అనుకుంటే, దాని వల్ల ప్రజలు బాధపడుతున్నారు అనుకుంటే.. కచ్చితంగా ప్రతిపక్ష పార్టీ జనసేన పోరుబాటని ఎంచుకోవాల్సిందే. మరి పోరాటాలకి కూడా 10 రోజులు, 20 రోజులు అంటూ డెడ్ లైన్లు పెడుతున్నారంటే అది ఎలాంటి సినిమా రాజకీయమో జనసైనికులే ఆలోచించుకోవాలి.

హీరో, విలన్ కి 24 గంటలు డెడ్ లైన్ ఇస్తున్నట్టు… పవన్ కల్యాణ్ రాక కోసం ఆయన ప్రతినిధి నాదెండ్ల కూడా డెడ్ లైన్ ఇస్తున్నారనమాట. అర్జంట్ గా పవన్ కల్యాణ్ రాలేరు కాబట్టి, డెడ్ లైన్ తో కాలయాపన చేస్తున్నారు. ఒకవేళ ఈ 10 రోజుల్లోపు ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చినా, రాకపోయినా పవన్ కాల్షీట్లను బట్టి నాదెండ్ల మరో స్టేట్ మెంట్ ఇచ్చేస్తారు.

మొత్తమ్మీద సినిమాలే కాదు, రాజకీయాలు కూడా కాల్షీట్ల ప్రకారం చేస్తున్నారు పవన్ కల్యాణ్. షూటింగ్ లు లేనప్పుడు జనాల్లో తిరిగి, సినిమాలు ఉన్నప్పుడు కేవలం స్టేట్ మెంట్లు ఇచ్చి కాలం గడుపుతున్నారు.

అచెన్న రిపేర్లు చెయ్యగలడా?