ఒకవైపు సరిగ్గా ఇదే రోజు పవన్ కల్యాణ్ రాజకీయ పెతాపం ఏ పాటిదో తేలిందని ప్రత్యర్థులు అంటున్నారు. పవన్ కల్యాణ్ అప్పట్లో చేసిన సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆయన చేసిన శాసనాలు.. అన్నీ పతనం అయ్యింది గత ఏడాది మే 23వ తేదీన!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జన్మలో సీఎం కాలేరని, తను కానివ్వనన్ని గడ్డం పెంచిన పవన్ కల్యాణ్ అప్పట్లో ఒక భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞకు ఉన్న పవర్ ఏమిటో 2019 మే 23న తెలిసివచ్చింది. అలాగే అప్పట్లో తను కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నారు.. అయితే కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేక, ఒకటికి రెండు చోట్ల పోటీ చేసి, రెండు చోట్లా ఓడిన ఘనతను సొంతం చేసుకుంది కూడా మే 23నే! అంత వరకూ పిల్ల సైనికులు జనసేన వాపును బలంగా చూపుతూ వీరంగం చేశారు. వాళ్లకూ అసలు విషయం అర్థం అయ్యింది సరిగ్గా గత ఏడాది మే 23నే! పవన్ కల్యాణ్ గురించి ఉన్న భ్రమలన్నీ అప్పటితో తొలగిపోయాయి. అందుకు వార్షికోత్సవం జరుగుతూ ఉంది!
ఇలాంటి సమయంలో.. జనసేన కంగాళీ రాజకీయాలు మాత్రం ఆగడం లేదు! ప్రస్తుతం టీవీ షోల షూటింగులు లేవు. దీంతో నాగబాబుకు పొద్దుపోనట్టుగా ఉంది పాపం! ఆ వెకిలి కామెడీ షో ల షూటింగులు ఉండి ఉంటే.. అక్కడ నీఛ హాస్యానికి నాగబాబు అక్కడ పగలబడి నవ్వుతూ పొద్దుపుచ్చే వారు. తీరా కరోనా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉండిపోయే సరికి, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు!
గాంధీని చంపడాన్ని సమర్థించేయడం అయిపోయింది, కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మను తీసేయాలని, వేరే నేతల బొమ్మలను పెట్టాలని ఈయన సూచించేశారు! తన బొమ్మను కరెన్సీ నోటు మీద పెట్టమని గాంధీ అడగలేదు, అలాగే మిగతా నేతలెవరూ కూడా తమ బొమ్మలను నోట్ల మీద పెట్టమనీ కోరలేదు! ఈ పసలేని వాదనలు, పొద్దుపోని మాటలను సోషల్ మీడియా వచ్చాకా చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఖాళీ సమయంలో నాగబాబు ఆ వాదన వినిపించారు. అయినా కరెన్సీ అనేది పేదవాడికి ఉపయోగపడితే చాలు, దాని మీద గాంధీ బొమ్మ ఉన్నా, పటేల్ బొమ్మ ఉన్నా విలువైతే మారదు!
గాంధీ బొమ్మ కరెన్సీ మీద ఉందని నాగబాబులాంటి గాడ్సే భక్తులు దాన్ని తీసుకోరా? ఆల్రెడీ మోడీ తెచ్చిన రంగురంగుల కరెన్సీ జనాలకు లేని కన్ఫ్యూజన్ గా మారింది. ఏది వంద రూపాయల నోటో, ఏదో యాభై నోటో, పది రూపాయల నోటు ఏ రంగులో ఉంటుందో.. ఇవన్నీ జనాలకు గత కొంతకాలంలో వచ్చిన గందరగోళాలు. దేశంలో నిరక్షరాస్యుల శాతం 30 వరకూ ఉంటుంది. మోడీ తెచ్చిన రంగురంగుల కరెన్సీ వాళ్లను గందరగోళానికి గురి చేస్తూ ఉంటే, ఇక అనేక మంది నేతల బొమ్మలతో కరెన్సీని తీసుకురావాలని.. సోషల్ మీడియాలో చాలా మంది అరగదీసిన డిమాండ్ ను యూట్యూబ్ ద్వారా తన వాదనగా నాగబాబు డిమాండ్ చేశారు.
నాగబాబు చేస్తున్న న్యూసెన్స్ కు పవన్ కల్యాణ్ కూడా స్పందించక తప్పలేదు పాపం! ఇప్పుడు కరోనాను ఎదుర్కొనడం మీదే దృష్టి నిలపాలని, నేతలు క్రమశిక్షణను తప్పవద్దని, అనవసరమైన విషయాల గురించి స్పందించవద్దని పవన్ కల్యాణ్ సూచించేశారు! మరి ఈ సూచన నాగబాబు కూడానా? అనే విషయంలో స్పష్టత లేదు. నాగబాబు అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమట, పార్టీకి సంబంధం లేదట, ఇంతకీ నాగబాబుకు జనసేనతో సంబంధం ఉన్నట్టా? లేనట్టా? వ‌్యక్తిగతంగా స్పందించే హక్కు జనసేనలోని ఇతర నేతలకు ఉంటుందా? ఉండదా! జనసేన కంగాళీ, కామెడీ రాజకీయాలు ఎడతెగనివిలా ఉన్నాయే!