బీజేపీ, జనసేన పార్టీలు ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టే కనిపిస్తోంది. రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్న సందర్భంలో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చించిన అనంతరం విజయవాడలో జనసేనాని పవన్‌కల్యాణ్ ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన, బీజేపీ కలిసి పోరాడాలని నిర్ణయించాయి. అలాగే ఎన్నికలు ఏవైనా పొత్తులో భాగంగానే ముందుకెళ్లాలని అప్పట్లో ఇరు పార్టీల నేతలు ఒక అంగీకారానికి వచ్చారు.
పోరాటాలపై ఒప్పందమైతే కుదిరింది గానీ, ఆచరణకు నోచుకోలేదు. ఎవరికి వారే యమునాతీరే అన్న రీతిలో జనసేన, బీజేపీ నేతలు నాటి నుంచి వ్యవహరిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పొత్తు చిత్తు అవుతుందనే ప్రచారం లేకపోలేదు. మరోవైపు తిరుపతి ఉప ఎన్నికలో తామే పోటీ చేస్తామని జనసేన ప్రకటించినప్పటికీ, బీజేపీ ఎత్తుగడ ముందు అవేవీ కుదరలేదు. బీజేపీనే పోటీ చేసింది.
ఎన్నికల ప్రచారంలో పవన్ తప్ప, క్షేత్రస్థాయిలో కలిసి ముందుకు సాగలేదు. ఇక విజయవాడ కార్పొరేషన్లో బీజేపీ వల్ల తాము నష్టపోయామని జనసేన నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో రోడ్ల దుస్థితిపై సెప్టెంబర్ 2, 3, 4వ తేదీల్లో జనసేన డిజిటల్ ఉద్యమం చేయాలని నిర్ణయించింది.
ఇది కూడా ఎప్పట్లాగే బీజేపీతో సంబంధం లేకుండా ఒంటరిగా నిర్వహించాలని ఆ పార్టీ కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలు, వీర మహిళలు ఆ మూడు రోజుల్లో రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని ‘జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఫొటోలు, వీడియోల రూపంలో డిజిటల్ వేదికలపై పోస్టులు చేయాలని కోరారు.
అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే అక్టోబరు 2న రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక రోడ్డును ఎంచుకుని తమ కార్యకర్తలు శ్రమదానంతో బాగు చేస్తారని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బీజేపీ, జనసేన పార్టీలు మున్ముందు కూడా ఇదే రీతిలో రాజకీయాలు చేస్తే… 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తాయనేది ఎవరికీ అర్థం కావడం లేదు. రెండు పార్టీల మధ్య పూర్తిగా సమన్వయం లోపించిందనేందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు.