జనసేనాని పవన్‌కల్యాణ్ ఈ దఫా సీరియస్‌గానే ఉన్నట్టు కనిపిస్తోంది. జిల్లాల్లో పర్యటనలు, మండల స్థాయి కమిటీలపై జనసేనాని దృష్టి పెట్టారు. కమిటీల ఏర్పాటుకు దిశా నిర్దేశం చేయడం విశేషం, జనసేన స్థాపించిన ఏడేళ్లకు కమిటీలు ఏర్పాటు చేయాలనే తలంపు రావడం శుభపరిణామమని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
హైదరాబాద్‌లో జనసేన కార్యాలయంలో వివిధ జిల్లాల అధ్యక్షులతో అధినేత పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. పవన్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో తాను పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. జిల్లాకు వెళ్లినప్పుడు అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తానన్నారు. అలాగే వచ్చే నెల 15 నాటికి మండల పార్టీ అధ్యక్షులు, మండల కమిటీల నియామకం ప్రక్రియ పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
పార్టీని అడ్డు పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతారనే అనుమానంతో ఇంత కాలం పవన్‌కల్యాణ్ కమిటీల నియామకానికి వెళ్లలేదనే చర్చ జరుగుతూ వస్తోంది. అయితే పార్టీ బలపడాలంటే క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటు అవసరమనే అభిప్రాయాలు వెల్లువెత్త డంతో ఎట్టకేలకు ఆయన దిగరాక తప్పలేదు.
పైగా ఈ దఫా జిల్లాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించుకోవడం గమనార్హం. 2024 సార్వత్రిక ఎన్నికలను పవన్ సీరియస్‌గా తీసుకున్నారని జనసేన నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయించుకోవడంతో పాటు మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు.