తమిళనాడు దివంగత ముఖ్యమంత్రికి అనధికారికంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయో కానీ, అధికారికంగా మాత్రం ఉన్న ఆస్తులు పరిమితమే కావొచ్చు. జయలలిత ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలని, వేల కోట్ల రూపాయలనే మాట వినిపిస్తూ ఉంటుంది.
అయితే ఆమెపై ఉన్న అవినీతి అభియోగాల విలువ కూడా తక్కువే! కర్ణాటక కోర్టులో ఆమె అవినీతి కేసుల్లో దోషిగా నిర్ధారణ అయ్యారు. అప్పుడు కూడా ఆ అవినీతి విలువ అరవై కోట్ల రూపాయలు కాబోలు. అందులో శశికళ, ఇళవరసి లాంటి వాళ్లు కూడా సహ నిందితులు, దోషులు. వీరందరికీ భారీగా ఫైన్ కూడా వేసింది న్యాయస్థానం.
ఆ ఫైన్ ను కట్టి, జైలు శిక్షను పూర్తి చేసుకుని శశికళ ఇటీవలే విడుదలయ్యింది. ఇక జయలలిత ఆ కేసులో కొంత కాలం జైలు జీవితాన్ని అనుభవించారు. ఆమె ఫైన్ మొత్తాలను కట్టినట్టుగా మాత్రం ఎక్కడా వార్తలు రాలేదు. మరి జయలలిత తరఫున చెల్లించాల్సిన జరిమానాను, ఆమె లేదు కాబట్టి.. కట్టాల్సిందేనో లేదో కూడా కోర్టులు క్లారిటీ ఇచ్చినట్టుగా లేవు. ఆ సంగతలా ఉంటే.. జయలలిత ఆస్తులకు దీప, దీపక్ లు చట్టపరంగా వారసులు అయ్యారు.
జయలలిత ఆస్తులకు ఆమె మేనకోడలు, మేనల్లుడే వారసులు అని ఇది వరకే ప్రకటించింది న్యాయస్థానం. ఈ విషయమై మరోసారి ప్రభుత్వానికి ఇవే ఆదేశాలు ఇచ్చింది. జయలలితకు సంబంధించిన వేద నిలయం పై పూర్తి హక్కులు దీపా జయకుమార్, దీపక్ లకే చెందుతాయని మద్రాస్ హై కోర్టు స్పష్టం చేసింది. వేద నిలయాన్ని జయ స్మారకంగా మారుస్తామంటూ.. తమిళనాడును ఇది వరకూ ఏలిన పళనిస్వామి ప్రభుత్వం కోర్టుకు చెప్పింది.
ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వానికి ఈ విషయంలో పెద్దగా ఆసక్తి కూడా లేకపోవచ్చు. దీనికి అనుగుణంగా కోర్టు కూడా ఈ విషయంలో ప్రభుత్వ వాదనతో ఏకీభవించలేదు. దివంగత జయలలితకు చెన్నైలో ఒక స్మారకం ఉండగా, మరో స్మారకం ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వ ధనంతో స్మారకాన్ని నిర్మించే ఆలోచనను మానుకోవాలని స్పష్టం చేసింది.
జయలలిత ఇంటిని ఆమె ప్రైవేట్ ఆస్తిగా పరిగణిస్తూ.. రక్తసంబంధీకులు అయిన దీప, దీపక్ లకే ఆ ఇల్లు చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది.
ఇదే సమయంలో కోర్టు మరో అంశాన్ని కూడా ప్రస్తావించింది. జయలలిత చెల్లించాల్సిన పన్నులు ఏవైనా ఉండి ఉంటే.. వాటిని, దీప, దీపక్ ల నుంచి వసూలు చేసుకోవాలని ఐటీ అధికారులకు కోర్టు స్పష్టం చేసింది. ఇలా ఆస్తులకైనా, పన్నులకైనా దీప, దీపక్ లే వారసులు అయ్యారు.
జయ ఉన్న రోజుల్లో వీరెవరో కూడా ఎవరికీ తెలియదు. వీరు కూడా బయటకు వచ్చే సాహసం చేయలేదు. అలాంటిది ఇప్పుడు జయ ఆస్తులకూ, అప్పులకూ వీరే వారసులయ్యారు. రాజకీయంగా వీరికి ఇది వీరికి పెద్దగా లాభం చేకూర్చడం లేదని స్పష్టం అవుతోంది. ఇక కట్టాల్సిన పన్నులన్నీ పోనూ.. వీరికి ఆస్తులు ఏ మేరకు మిగులుతాయో!