అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ఆ మున్సిపాలిటీకి గతంలో చైర్మన్ గా వ్యవహరించిన నేపథ్యం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడే ప్రభాకర్ రెడ్డి తను మళ్లీ మున్సిపాలిటీకి పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఆ మేరకు ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఆయన తాడిపత్రి మున్సిపాలిటీలోని ఒక వార్డుకు మెంబర్ గా పోటీలో ఉన్నారు.
సాధారణంగా వార్డు మెంబర్ గా పోటీ చేసిన వారు..తమ రాజకీయ ఎదుగుదలలో భాగంగా ఎమ్మెల్యే గా నామినేషన్ వేసేంత స్థాయి వరకూ ఎదుగుతుంటారు. అయితే రాజకీయాల్లో తామేం చేసినా వెరైటీగా ఉండేట్టుగా చూసుకునే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్ రెడ్డి ఇలా మున్సిపల్ వార్డు మెంబర్ గా పోటీలో ఉన్నారు.
తాము ఓడిపోయినప్పటి నుంచి తాడిపత్రి నాశనం అయ్యిందని, తాడిపత్రిని కాపాడుకోవాలంటూ ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం ఓడిపోవడంతో ఇబ్బంది పడుతున్నది తాడిపత్రినా, జేసీ ఫ్యామిలీనా అనే క్లారిటీ ప్రజలకు అయితే ఉండొచ్చు. రాష్ట్రంలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మున్సిపాలిటీల్లో తాడిపత్రి కూడా ఒకటి.
ఇక్కడ స్వయంగా ప్రభాకర్ రెడ్డి కూడా పోటీలో ఉండటం, అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా పోటీలో ఉండటం అమితాసక్తిని రేపుతూ ఉంది. మరి తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో జేసీ ప్రాబల్యం ఏమైనా మిగిలే ఉందో లేదో ఈ ఎన్నికల ఫలితాన్ని బట్టి స్పష్టత రానుంది.