టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం, ఆ తర్వాత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
తెలంగాణ శాసనసభా ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌ను జేసీ దివాకర్‌రెడ్డి కలిశారు. కేసీఆర్‌తో రాజకీయాలపై ముచ్చటించారు. అంతకు ముందుగా సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డిలతో ఆయన సమావేశమయ్యారు. సుదీర్ఘ కాలం పాటు జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.
సీఎల్పీ కార్యాలయంలో జేసీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను విడిచిపెట్టి నష్టపోయామన్నారు.
‘నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలవడం కష్టమని ముందే చెప్పా. ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసు. నాకు జానారెడ్డి మంచి మిత్రుడు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి నాకు తెలియదు. రాజకీయాలు బాగోలేవు.. సమాజం కూడా బాగోలేదు. ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తా. మేం తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాం. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదు’ అని జేసీ వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జేసీ బ్రదర్స్‌లో వైరాగ్యం చోటు చేసుకుందనే అభిప్రాయాలున్నాయి. టీడీపీ పాలనలో జగన్‌పై నోరు పారేసుకున్న జేసీ బ్రదర్స్… ఆ తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వస్తామనే మాటలు ఆయన వైరాగ్యం నుంచి వచ్చినవే అని నెటిజన్స్ అంటున్నారు.