కొందరికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు చచ్చేంత వరకు ఉంటాయంటారు. అలాంటి కోవకు చెందిన నేతల్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఒకరు. సీనియర్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, అనంతపురం ఎంపీగా….ఇలా వివిధ హోదాల్లో పనిచేసిన దివాకర్‌రెడ్డి తన స్థాయికి తగ్గట్టు ఏనాడూ ప్రవర్తించలేదనే విమర్శలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ సన్యాసి ప్రకటించిన జేసీ సోదరులు, తమతమ స్థానాల్లో కుమారులను నిలబెట్టారు.
తండ్రులు చేసిన తప్పిదాలకు జగన్ హవా తోడు కావడంతో అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి జేసీ దివాకర్‌రెడ్డి కుమా రుడు పవన్, తాడిపత్రి అసెంబ్లీ నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. జేసీ వారసుల రాజకీయ అరంగేట్రమే ఓటమితో స్టార్ట్ కావడం అన్నదమ్ముళ్లకు తీరని ఆవేదన మిగిల్చింది.
జేసీ సోదరులిద్దరికీ నోటి దురుసు ఎక్కువే. వ్యక్తిగతంగా జేసీ సోదరులు మంచి మనుషులైనప్పటికీ , అవసరానికి మించి మాట్లాడ్డం వల్ల ప్రజల్లో పలుచన అయ్యారు. జేసీ సోదరులకు అదే మైనస్. ముఖ్యంగా జేసీ సోదరులకు కంచుకోట అయిన తాడిపత్రి నుంచి ఓటమిని వాళ్లు ఊహించనది, జీర్ణించుకోలేనిది అని చెప్పవచ్చు. ప్రధానంగా వైఎస్ జగన్‌పై జేసీ సోదరులు అవాకులు చెవాకులు పేలడం సర్వసాధారణమైంది.
వైఎస్ జగన్‌ను దూషించడం వల్ల టీడీపీ శ్రేణులకు, చంద్రబాబునాయుడుకు ఆనందం కలిగించి ఉండొచ్చేమో కానీ, మెజార్టీ ప్రజలకు కోపం తెప్పించామనే విషయాన్ని జేసీ సోదరులు ఇంకా గుర్తించినట్టు లేదు. ఒకవేళ ఆ పశ్చాత్తాపం వారిలో కలిగి ఉంటే తాజాగా జగన్‌పై మరోసారి జేసీ దివాకర్‌రెడ్డి నోరు పారేసుకుని వుండే వారు కాదేమో.
మాజీ ఎంపీ జేసీ గురువారం మీడియాతో మాట్లాడుతూ … ‘రాష్రంలో రాక్షస రాజ్యం నడుస్తోంది. వాళ్లదే రాజ్యం. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా మా వాడు లెక్కచేయడం లేదు. హైకోర్టునే పీకి పారేశాడు. అసలు మా వాళ్లు (టీడీపీ నేతలు) ఎందుకు దీక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదు. నా అంతకు నేను దీక్ష చేస్తే ఆయన (సీఎం జగన్)లో మార్పు రాదు. ఉవ్వెత్తున ఆయన ఇంటి ముందు కూర్చోవాలి. కొడితే 32 పండ్లు రాలేలా కొట్టాలి. లేదంటే దాని జోలికి పోకూడదు. జిందాబాద్… ముర్దాబాద్‌లకు జగన్ మాట వినడు. రాష్ట్రంలో సగం జనాభా ఆయన ఇంటి ముందు కూర్చుంటే వింటాడేమో..? పోతిరెడ్డి పాడు విషయంలో మా వాడు చాలా సిన్సియర్‌గానే ఉన్నాడనిపిస్తోంది’ అని దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మాట్లాడే సందర్భంలో జేసీ హావభావాలు , వెకిలి చేష్టలు ఆయనకు హూందాతనాన్ని ఇవ్వవు. నిజంగానే జేసీ సీరియస్ విషయాలు మాట్లాడినా లైట్ తీసుకునే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే అంత పెద్ద మనిషిని రాజకీయ కమెడియన్‌గా చూడటం ఒకింత బాధాకర విషయమే. జేసీ ది‘వాగుడు’రెడ్డి అనే పేరును స్థిరపరచుకునేలా ఆయన వ్యవహరించారనడంలో అతిశయోక్తి లేదు.
-సొదుం