జేడీ లక్ష్మీనారాయణ. మాజీ సీబీఐ అధికారి. ఎన్నికల ముందు ఆయన అనూహ్యంగా పవన్ పార్టీలో చేరారు. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తారని అంతా నాడు అనుకున్నారు.
మరి ఎవరి ప్రమేయం ఉందో, లేక ఆయన సొంతంగా ఆలోచన చేశారో కానీ జనసేనలో పవన్ పక్కన నిలబడి విశాఖ ఎంపీగా పోటీకి దిగారు. షరా మామూలుగా జనసేనతో పాటు ఆయన కూడా ఓడిపోయారు. కానీ విశాఖలో కేవలం 15 రోజుల వ్యవధిలో ప్రచారం చేసి కూడా రెండు లక్షల 80 వేల పై చిలుకు ఓట్లు సాధించిన ఘనత మాత్రం జేడీదే.
ఆ ఓట్లలో అధికశాతం జేడీ సొంత ఇమేజ్ వల్ల వచ్చాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం విశాఖ ఎంపీ పరిధిలో మిగిలిన అసెంబ్లీ సీట్లలో వచ్చిన జనసేనకు వచ్చిన ఓట్లు కలిపి చూసినా జేడీకి వచ్చిన ఓట్లకు సరిసాటి కావు.
ఇవన్నీ ఇలా ఉంటే జనసేనలో ఏ కీలమైన బాధ్యతా అప్పగించకుండా కేవలం జనసైనికుడిలాగానే ఆయన్ని పవన్ ఉంచారన్న ఆవేదన ఎటూ ఉంది. ఇపుడు ఆయనకు మరో ప్రమదాన్ని కూడా పవన్ ముందుకు తెచ్చారు.
2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీ గా జనసేన నుంచి పోటీ చేయడానికి జేడీకి ఏ రకమైన చాన్సూ లేకుండా బీజేపీతో పొత్తులకు పవన్ తెరలేపారు.
దానివల్ల ఈ రెండు పార్టీల పొత్తులో విశాఖ ఎంపీ సీటు కచ్చితంగా బీజేపీ తీసుకుంటుంది. పైగా విశాఖ సిటీలో బీజేపీకి బలం ఉంది. ఒకసారి గెలిచింది కూడా. మరోవైపు ఎంపీ సీట్లు కూడా పెద్ద ఎత్తున బీజేపీకి కావాలి కూడా.
ఇక పవన్ సైతం ఏమీ అనలేని పరిస్థితి. నిజంగా పవన్ నాలుగున్నరేళ్ళ ముందుగా పొత్తులు పెట్టుకుని జేడీకి చాలా మేలు చేశారనే అంటున్నారు. ఎన్నికల ముందు పొత్తుల పేరిట సీట్లు ఎగరగొడితే అపుడు చేసేదేమీలేదు.
ఇపుడు చాలా సమయం ఉంది కాబట్టి జేడీ తనదైన రాజకీయం కూడా చేసుకునే వీలుంది. దాంతో అసలే జనసేనలో అసంత్రుప్తిగా ఉన్న జేడీ ఈ పొత్తుల కధతో ఇక పూర్తిగా ఆ పార్టీకి గుడ్ బై కొడతారన్న ప్రచారం అయితే సాగుతోంది.
మరో వైపు జేడీయే స్వయంగా బీజేపీలో చేరి విశాఖ నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసినా చేయవచ్చునన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే జేడీ టీ కప్పులో బీజేపీ పొత్తు తుఫాన్ స్రుష్టించినట్లేనని అంటున్నారు.