టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ సొంత గూటికి చేరారు. దసరా మంచిరోజు కావడంతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. నిజానికి ఈయన వైసీపీకి చెందిననేత. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత టీడీపీకి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు జగన్ గెలవడంతో మళ్లీ ఇటువైపు వచ్చారు. తామంతా తప్పిపోయిన గొర్రెల లాంటివాళ్లమని, తప్పు తెలుసుకున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు జూపూడి.
“ఓ పక్కన ఆంధ్రా ఐరెన్ మ్యాన్ గా ఉన్న విజయసాయి గారు, రెండోవైపు 10 ఏళ్లుగా ప్రజల మధ్యలోనే జగన్ ఉన్నారు. ఓ మేసయ్యలాగా ఆయన నిలిచారు. మేం తప్పిపోయిన గొర్రెల్లాగ అటుఇటు పోయి ఉండొచ్చు. నిర్మోహమాటంగా చెబుతున్నాను. మేం తప్పిపోయిన గొర్రెలం. జగన్ కు ఆహ్వాదకరమైన వాతావరణం కల్పించాలని, ఆయనకు దగ్గరుండి సేవ చేయాల్సిన అవసరం ఉందని తెలిసి వచ్చాను. నా వైపు నుంచి పొరపాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దుకోవడమే గొప్ప అని భావిస్తూ వైసీపీలో చేరాను. నాకు ఏ పదవులు వద్దు, సైనికుడిలా పనిచేస్తాను.”
జూపూడితో పాటు జనసేన నేత ఆకుల సత్యనారాయణ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరినట్టు ఈయన ప్రకటించుకున్నారు. ఇకపై తనకు జనసేనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టంచేస్తున్నారు ఆకుల.
“ఈమధ్యే జనసేన పార్టీకి రాజీనామా చేశాను. ఈరోజు వైసీపీలో చేరాను. వైసీపీలో ఎందుకు చేరానని మీరు అడగొచ్చు. మేనిఫెస్టో అనేది మరిచిపోయేదిగా తయారైంది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మేనిఫెస్టోలో చెప్పింది చేస్తున్నారు జగన్. పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నారు. ఇలాంటి అభివృద్ధిలో నేను కూడా భాగం అవ్వాలని చేరాను.”
గత ఎన్నికల్లో వీళ్లు ప్రజాక్షేత్రంలో గెలవలేదు. పైగా తమ పార్టీలకు రాజీనామాలు కూడా సమర్పించారు. అందుకే వీళ్లను పార్టీలో చేర్చుకోవడానికి జగన్ అంగీకరించారు. జూపూడి, ఆకుల రాకతో ఇప్పుడు చాలామంది జనసేన, టీడీపీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. కానీ జగన్, విజయసాయిరెడ్డి మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరిని పడితే వాళ్లను పార్టీలోకి ఆహ్వానించడం లేదు. గతంలో చంద్రబాబు చేసిన తప్పును తిరిగి చేయదలుచుకోలేదు.