జీవితంలో తానెప్పటికీ ముగ్గురిని గుర్తించుకుంటానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం పొన్నవరంలో చీఫ్ జస్టిస్‌గా మొదటిసారి అడుగు పెట్టిన ఆయన ఆనందంతో పరవశించారు. పుట్టిన గడ్డపై ఆత్మీయుల ఆదరణకు మురిసిపోయారు. చీఫ్ జస్టిస్‌ను ఘనంగా సన్మానించారు.
ఆత్మీయ సన్మాన సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పుకొచ్చారు. పొన్నవరంతో తనకు ప్రత్యేక అనుంబంధముందని గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పొన్నవరం, కంచిక చర్లలో తన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిందన్నారు.
చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని గుర్తు చేసుకున్నారు. గ్రామంలోని రోడ్లు, పొలాలు, చెరువులు తనకు ఇంకా గుర్తున్నాయని బాల్యం నాటి రోజులను ఆవిష్కరించారు.
అన్ని సమస్యల పరిష్కారానికి ఐకమత్యమే ఔషధమన్నారు. తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం ప్రవర్తించాలని ఆయన సూచించారు. తెలుగు జాతికి సరైన గుర్తింపు లేదనే ఆవేదన తనలోనూ ఉందని వాపోయారు. తెలుగువాడిగా దశంలోనే అత్యున్నత న్యాయస్థానంలో తాను ఉన్నానంటే ప్రజలందరి అభిమానం, ఆశీస్సులతోనే అన్నారు. దీన్ని మర్చిపోనని ఆయన చెప్పారు.