టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మొదలుకుని ఆ పార్టీకి చెందిన ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులకు కడప అంటే ఎందుకంత కక్షో అర్థం కావడం లేదు. కడప, పులివెందుల, రాయలసీమ అని పదేపదే ప్రాంతాలను ప్రస్తావిస్తూ , అక్కడి ప్రజలకు కించపరచడం ఎలాంటి సంస్కారమో వారికే తెలియాలి.
విశాఖలో కడప రాజకీయం ప్రారంభమైందని, నగరంలో ఖాళీ స్థలాలను కడప బ్యాచ్ అప్పుడే కబ్జా చేస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం తన డబ్బా చానల్‌తో మాట్లాడుతూ విమర్శించాడు. కడప రాజకీయం ఏంటి? విశాఖలో ఖాళీ స్థలాలను కడప బ్యాచ్ కబ్జా చేయడం ఏంటి? ఇలా పదేపదే ఒక ప్రాంతంపై సాంస్కృతిక దాడి చేయడం వల్లే అమరావతిని రాయలసీమ వాసులు తమ రాజధానిగా గుర్తించలేదన్న వాస్తవాన్ని టీడీపీ నేతలు ఎప్పటికి గుర్తిస్తారు?
కడప అంటే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని తొలి గడప. కడప అంటే తాళ్లపాక అన్నమాచార్యునికి జన్మనిచ్చిన పుణ్యక్షేత్రం. 500 సంవత్సరాల క్రితమే భవిష్యత్‌ను అంచనా వేసి కాలజ్ఞానం చెప్పిన తాత్వికవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నడియాడిన గడ్డ. మల్లీశ్వరి, పాతాళభైరవి, మిస్సమ్మ తదితర అత్యుత్తుమ చిత్రాలను నిర్మించిన విజయా పిక్చర్స్ వారి స్వస్థలం.
అసాంఘిక, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా కడపను చిత్రీకరించాలనే టీడీపీ ప్రయత్నాలను గత ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు తిప్పికొట్టినా ఇంకా వారికి బుద్ధి రాలేదు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలంటే, పార్లమెంట్‌లో మాట్లాడి దేశ రాజధాని ఢిల్లీని మధ్యలోకి తీసుకొచ్చి ఏర్పాటు చేసేందుకు పోరాడండి.
అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుకోవడమేనా ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే అనే ప్రశ్నలకు సమాధానం చెప్పండి రామ్మోహన్ నాయుడు. చావు తప్పి కన్నులొట్ట పోయిన చందంగా…గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి తృటిలో తప్పించుకున్నావనే విషయాన్ని మరిచినట్టున్నావు.
అయినా శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర యాస, భాషలను కించపరుస్తున్నా నోరెత్తలేని నువ్వు…కడప గురించి అవాకులు చెవాకులు మాట్లాడటం సబబేనా? సీఎం జగన్‌పై కోపం ఉంటే ఆయనతో తేల్చుకోండి. అంతే కానీ రాయలసీమ, కడప, పులివెందుల ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం మీ ఎంపీ పదవికి తగదు.