జ‌గ‌న్ ఉక్కు సంక‌ల్పంః నాడు అసాధ్యం, నేడు సాధ్యం

జ‌గ‌న్ “ఉక్కు” సంక‌ల్పానికి ఇదే నిద‌ర్శ‌నం. చంద్ర‌బాబు పాల‌న‌లో అసాధ్య‌మ‌న్న దాన్ని సుసాధ్యం చేస్తున్నారు. దీనికి పాల‌కుల దీక్షాద‌క్షిత‌లే కార‌ణంగా చెప్పొచ్చు. క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు కోసం రెండు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో…

జ‌గ‌న్ “ఉక్కు” సంక‌ల్పానికి ఇదే నిద‌ర్శ‌నం. చంద్ర‌బాబు పాల‌న‌లో అసాధ్య‌మ‌న్న దాన్ని సుసాధ్యం చేస్తున్నారు. దీనికి పాల‌కుల దీక్షాద‌క్షిత‌లే కార‌ణంగా చెప్పొచ్చు. క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు కోసం రెండు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో పాటు మ‌రో ఐదు దేశీయ సంస్థ‌లు ముందుకు రావ‌డం జ‌గ‌న్ సుప‌రిపాల‌న‌కు నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు.

క‌డ‌ప హైగ్రేడ్ ఉక్కు క‌ర్మాగార నిర్మాణానికి పెట్టుబ‌డులు పెట్ట‌డానికి లిబ‌ర్టీ, ఆర్సెలార్ మిట్ట‌ల్ వంటి అంత‌ర్జాతీయ పేరు మోసిన సంస్థ‌లు ఆస‌క్తిక‌ర‌న‌బ‌ర‌చ‌డం శుభ‌ప‌రిణామంగా చెప్పొచ్చు. అలాగే ఈ రెండు సంస్థ‌ల‌తో పాటు  టాటా స్టీల్స్‌, ఎస్ఆర్ స్టీల్స్ స‌హా మొత్తం ఐదు దేశీయ కంపెనీలు కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పెట్టుబ‌డుల‌న్నీ వెన‌క్కి పోయాయ‌ని, ఒక్క ప‌రిశ్ర‌మ కూడా ఏర్పాటు కాలేదంటూ ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటుకు దిగ్గ‌జ కంపెనీలు ముందుకు రావ‌డం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీకి ఎంత మాత్రం రుచించ‌ని వ్య‌వ‌హార‌మ‌నే చెప్పాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ‌త ఏడాది డిసెంబ‌ర్ 23న  జ‌మ్మ‌ల‌మడుగు మండ‌లం సున్నపురాళ్లపల్లె దగ్గర శంకుస్థాప‌న చేసి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తామని ఇచ్చిన హామీని నెర‌వేర్చే క్ర‌మంలో జ‌గ‌న్ ముందడుగు వేసిన విష‌యం తెలిసిందే. మూడేళ్ల‌లో ఫ్యాక్ట‌రీ నిర్మాణం పూర్తి చేసి ఉత్ప‌త్తి ప్రారంభించాల‌నేది జ‌గ‌న్ ప్ర‌భుత్వ ల‌క్ష్యం.

ఈ స్టీల్ ఫ్యాక్టరీని రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసేందుకు ప‌నులు జ‌రుగుతున్నాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు. దీని కోసం రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట ఒక ప్రత్యేక కంపెనీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆ ఉక్కు క‌ర్మాగారంలో పెట్టుబ‌డుల కోసం ఈ ఏడాది జూలై 7న టెండ‌ర్లు పిలిచారు. రూ.6 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి వీలుగా  విదేశీ, స్వదేశీ కంపెనీలు ప్ర‌తిపాద‌న‌లు దాఖ‌లు చేసిన‌ట్టు అధికారులు తెలిపారు.  

కాగా కంపెనీల‌తో ఒప్పందం కుదిరే నాటికి ప్లాంట్ నిర్మాణ ప్ర‌దేశంలో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటోంది. జాతీయ ర‌హ‌దారితో అనుసంధానంతో పాటు స్థానికంగా ఇంట‌ర్న‌ల్ రోడ్లు , ప్ర‌హ‌రీగోడ‌ల నిర్మాణ ప‌నులు మొద‌లు పెట్టారు. మూడేళ్ల లోపు క‌ర‌వు ప్రాంత‌మైన క‌డ‌ప జిల్లాలో ప్ర‌త్య‌క్షంగా వేలాది మంది, ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మందికి ఉపాధి క‌ల్పించేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోంది.

జ‌గ‌న్ పాల‌న‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటు ఓ పెద్ద మైలురాయిగా చెప్పొచ్చు. నిరుద్యోగుల‌కు, క‌ర‌వు ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఉపాధి క‌ల్పించాల‌న్న ముఖ్య‌మంత్రి ఉక్కు సంక‌ల్పానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి?

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు