‘కమలసేన’ : కొత్త బిచ్చగాడు పొద్దెరగడనీ…

భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు ఏమీ లేవని.. మనస్ఫూర్తిగానే.. ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో కలసి పోటీచేస్తున్నాయని ప్రజల ముందు చాటుకోవడానికి వారు చాలా తాపత్రయపడుతున్నారు. పవన్ తోనే…

భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు ఏమీ లేవని.. మనస్ఫూర్తిగానే.. ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో కలసి పోటీచేస్తున్నాయని ప్రజల ముందు చాటుకోవడానికి వారు చాలా తాపత్రయపడుతున్నారు. పవన్ తోనే తొలి ప్రచార సభ పెట్టించారు. 

తర్వాత.. భాజపా నాయకులు వరుస సభలు పెడుతున్నారు. కేంద్ర పెద్దలు కూడా టూర్ చేస్తున్నారు. ప్రతి ప్రెస్ మీట్ అయినా సరే.. బీజేపీ వారు.. ఒక జనసేన నాయకుడని కూడా వెంటపెట్టుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్ ఏకంగా తిరుపతిలోనే తిష్టవేసి.. తాము ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్న బిల్డప్ ఇస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రెండు పార్టీలను కలిపి ‘కమలసేన’గా వ్యవహరించదలచుకుంటే గనుక.. వారి ఎత్తుగడలు, వ్యూహాలు, పోకడలు గమనించినప్పుడు.. ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న సామెత..’ గుర్తుకు వస్తోంది. ఎందుకంటే.. తిరుపతి ఎంపీ స్థానం ఉప ఎన్నికకు వారు ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ, జనసేన అగ్ర నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చాలా ఆర్భాటంగా.. వారు మేనిఫెస్టోను విడుదల చేయడం.. విచిత్రాల్లోకెల్లా విచిత్రం! కామెడీల్లోకెల్లా కామెడీ!!

ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తిరుపతిలో షెడ్యూల్డు సభను కూడా రద్దు చేసుకుని.. ప్రజలకు ఓ లేఖ రాసి.. తమలోని గెలుపు ధీమాను పరోక్షంగా ప్రకటించారు. అదే సమయంలో.. ఈ మేనిఫెస్టో వంటి ప్రయత్నం కమలసేన చేస్తున్నది! దీనిద్వారా తమ రాజకీయ అపరిపక్వతనే ప్రజల ముందు చాటుకుంటున్నదనే విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా.. తాము గెలిస్తే రాష్ట్రానికి/ దేశానికి ఏం చేస్తాం అనే విషయాన్ని ‘పార్టీలు’ మేనిఫెస్టోగా ప్రజల ముందు పెడతాయి. అందులోని హామీలను ప్రజలు నమ్మేదాన్ని బట్టి.. వారికి వచ్చే ఓట్లుంటాయి. ఆ మేనిఫెస్టో అనేది.. ఏ పార్టీ నెగ్గాలి.. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనే విషయాల్ని ప్రజలు నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది.

కానీ ఇప్పుడు జరుగుతున్నది ఉప ఎన్నిక! ఈ ఎన్నికలో నెగ్గే పార్టీ.. కొత్తగా దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది లేదు. ఒకవేళ భాజపా అభ్యర్థికి ఓట్లు వేయాలని వారు అభ్యర్థించినా సరే.. వారు గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఏ వాగ్దానాలు అయితే మేనిఫెస్టోలో ఇచ్చారో.. అవే ఇప్పటికే ప్రామాణికంగా భావించాలి. అయితే చాలా తమాషాగా… తిరుపతి ఉప ఎన్నికకోసం ఒక ప్రత్యేక మేనిఫెస్టోను వారు ప్రకటించడం చూసి జనం నవ్వుకుంటున్నారు.

పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు కూడా పార్టీ తరఫున మేనిఫెస్టో ప్రకటించడం వంటి కామెడీలు చేసే చంద్రబాబునాయుడుకు రాని విచిత్రమైన ఐడియాలు కమలసేన టీంకు వస్తున్నాయని జనం అనుకుంటున్నారు.