అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే అద్భుతాలు జరిగిపోతాయని ఎవరూ ఆశించరు. పైగా లోటు బడ్జెట్ తో, అప్పులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రాత్రికిరాత్రి అద్భుతాలు అస్సలు జరగవు. పదో తరగతి పిల్లాడ్ని అడిగినా ఈ విషయం చెబుతాడు. కానీ అదేంటో పాపం, కన్నా లక్ష్మీనారాయణకు మాత్రం అర్థంకావడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చి 2 నెలలైనా కాకముందే, విమర్శలు గుప్పించారు. అభివృద్ధి జరగడం లేదని మొసలికన్నీరు కారుస్తున్నారు.
“తెలుగుదేశం పాలనతో పోల్చిచూసుకుంటే.. వైసీపీ ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువగా అరాచకాలు జరుగుతున్నాయి.” కన్నా తాజా వ్యాఖ్యలివి. ఈ స్టేట్ మెంట్ చూస్తే ఎవరికైనా నవ్వురావడం ఖాయం. ఐదేళ్ల తెలుగుదేశం అరాచక పాలనకు, రెండు నెలలు కూడా నిండని వైసీపీ పాలనకు కన్నా ముడిపెట్టారు. ఇంతకంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా? ఈ 50 రోజుల్లో కన్నాకు అన్ని అరాచకాలు ఎక్కడ కనిపించాయో ఆయనకే తెలియాలి.
ఇక్కడితో ఆగలేదాయన. ఏపీలో ప్రభుత్వ పథకాలు ప్రచారానికే పనికొస్తున్నాయట. సామాన్య జనాలకు అందడం లేదట. రాష్ట్రంలో పథకాల అమలు, తాజాగా జరిగిన బడ్జెట్ కేటాయింపులపై ఏమాత్రం అవగాహన లేకుండా కన్నా ఈ వ్యాఖ్యలు చేశారనే విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
కన్నా వ్యాఖ్యలు చూసిన వాళ్లంతా ఆయనకు బొత్తిగా కామన్ సెన్స్ లేదంటున్నారు. నిజానికి ఈ విషయంలో కన్నా కూడా ఏం చేయలేకపోతున్నారు. అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకోవాలి. వైసీపీ సర్కార్ పై విమర్శలు చేయాలని అధిష్టానం చెప్పినట్టుంది. అందుకే తలాతోకా లేకుండా ఏదో ఒకటి నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉత్సాహం కంటే.. ఏదో ఒకటి అనాలనే అవసరమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు పదవీ గండం పొంచి ఉంది.
ఏ క్షణానైనా కన్నా పదవి ఊడిపోతుందంటూ కథనాలు వరుసపెట్టి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తను కూడా యాక్టివ్ గా ఉన్నానని చెప్పుకోవడం కోసం కన్నా ఇలా వైసీపీ ప్రభుత్వంపై అర్థంపర్థంలేని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. అందుకే “పాపం కన్నా” అంటూ సర్దిచెప్పుకుంటున్నారు.