ఏపీలో బీజేపీ పరిస్థితి అందరికీ తెలిసిందే. పిలిచి టికెట్ ఇస్తామన్నా ఎవరూ పోటీ చేయలేని పరిస్థితి. అభ్యర్థులే లేని బీజేపీకి ఓటర్లు ఉంటారని ఆశించలేం. అయితే నాయకులు మాత్రం బీజేపీలో గ్రూపులు కడుతూ కామెడీ చేస్తున్నారు. ఏపీ బీజేపీలో కన్నా వర్గం కొత్తగా తయారైంది. రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిన తర్వాత కన్నా గ్రూప్ కొన్నాళ్లపాటు సైలెంట్ అయింది.
ఎప్పుడైతే తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభకు కన్నా లక్ష్మీనారాయణ వచ్చారో, అప్పట్నుంచి మళ్లీ చంద్రబాబు ప్రోద్బలంతో కన్నా గ్రూప్ యాక్టివ్ అయింది. వీళ్లంతా బాబుకు జై కొడుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు.
సోము వీర్రాజు గ్రూప్..
ఈ గ్రూప్ వాళ్లు టీడీపీకి బద్ధశత్రువులు. చంద్రబాబు వల్లనే ఏపీలో బీజేపీ బలపడలేదని బలంగా నమ్మే గ్రూపు. సునీల్ దేవధర్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్థన్ లాంటి వాళ్లు ఈ గ్రూపులో ఉన్నారు. వీళ్లు టీడీపీతో పొత్తు వద్దంటున్నారు.
కుదిరితే అధికార పార్టీతో కలిసి వెళ్దామంటున్నారు. ఈ బ్యాచ్ లో కొంతమందికి జగన్ తో సత్సంబంధాలున్నాయి. టీడీపీతో వెళ్లి పూర్తిగా నాశనం అయిపోవడం కంటే.. అవకాశం ఉంటే వైసీపీతో కలసి అధికారంలో భాగస్వాములు కావడం వీరి కల.
కన్నా Vs సోము..
కన్నా హయాంలో ఏపీలో బీజేపీ సర్వ నాశనం అయిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సోము వీర్రాజు వచ్చాక కూడా పరిస్థితి ఏమంత మెరుగుపడలేదు కానీ.. టీడీపీతో అంటకాగడం మాత్రం తగ్గిపోయింది. సోము బాధ్యతలు చేపట్టాక, చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మీడియా ఛానెళ్ల చుట్టూ తిరిగి బాబుని ఏకిపారేశారు. కానీ ఇప్పుడు ఆయన కూడా సైలెంట్ గా ఉన్నారు.
అంతమాత్రాన బాబుకి మద్దతు తెలుపుతున్నారనుకోలేం కానీ.. టైమ్ కోసం వేచి చూస్తున్నారు. బాబుతో కలవాల్సిన సందర్భం వచ్చినా దూరంగా ఉంటున్నారు. అయితే అమరావతి ఉద్యమానికి జై కొట్టాలంటూ అమిత్ షా సూచించిన తర్వాత కన్నా వర్గం అలర్ట్ అయింది. అమరావతి అనే పాయింట్ ని అడ్డు పెట్టుకుని, టీడీపీతో రాసుకుపూసుకు తిరుగుతోంది.
పాదయాత్రకు మద్దతిచ్చినవారిలో ఎక్కువమంది టీడీపీతో సత్సంబంధాలున్నవారే ఉన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి కూడా పాదయాత్రకు అండదండగా ఉంటున్నారు. వీరంతా చంద్రబాబు డైరక్షన్లో పనిచేస్తున్నారనేది కాదనలేని విషయం.
ఎవరిది పైచేయి..
ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీ సరైన స్టాండ్ తీసుకోకుండా ఓట్లు రాబట్టుకోవాలంటే కుదరని పరిస్థితి. అందులోనూ అమరావతి విషయంలో బీజేపీపై ఎవరికీ నమ్మకం లేదు. చంద్రబాబు హయాంలో రాజధానికి మద్దతివ్వకుండా ఇప్పుడు మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ పెద్ద తప్పు చేస్తోంది బీజేపీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎలాగూ వ్యతిరేకత ఉంది. పోలవరం సహా ఇతర ప్రాజెక్ట్ ల విషయంలో ఏపీపై కనీసం కనికరించడం లేదు కేంద్రం. ఇన్ని తప్పులు పెట్టుకుని ఏపీలో ఓట్లు, సీట్లు కావాలనుకోవడం బీజేపీ అమాయకత్వం.
అది తెలిసి కన్నా.. టీడీపీతో లాలూచీ పడ్డారు, ఆ లాజిక్ తెలియక సోము.. ఒంటరి పోరాటం చేయాలనుకుంటున్నారు. 2024నాటికి టీడీపీతో బీజేపీ, జనసేన కలిస్తే అది కన్నా విజయం, టీడీపీని పక్కనపెడితే సోముదే పైచేయి అవుతుంది. అప్పటి వరకూ ఈ గ్రూపు రాజకీయాల కామెడీ భరించక తప్పదు.