తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయుధాల కోసం వెతుక్కుంటున్నారు. ఆరు నెలలు వేచి చూద్దామని తొలుత అనుకున్నా, జగన్ సర్కార్ మీద వీలైనంత తొందరగా యుద్ధం ప్రకటించేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదన్నది చంద్రబాబు ఆలోచన. కానీ, అవకాశాలు ప్రతిసారీ ఆయన్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. అసెంబ్లీలో ప్రతీ మాటకీ చంద్రబాబు తడబడుతున్నారు. చంద్రబాబుకి మానసిక స్థైర్యాన్నిచ్చే స్థాయిలో సంఖ్యా బలం కూడా లేదు అసెంబ్లీలో.
2014 ఎన్నికల ప్రచారంలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల గురించి చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిన విషయం విదితమే. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం.. చంద్రబాబు తాను వేయించిన మంజునాథ కమిషన్ నుంచి రిపోర్ట్ పూర్తిస్థాయిలో రాకుండానే, అసెంబ్లీ సాక్షిగా హంగామా చేసి, చేతులు దులుపుకోవడం తెల్సిన విషయాలే.
ఇక, 2019 ఎన్నికలు కొద్ది రోజుల ముందర కేంద్రం ఈబీసీల రిజర్వేషన్ల అంశం తెరపైకి తెస్తే, అందులోంచి 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించేసింది చంద్రబాబు సర్కార్. ఇప్పుడు ఆ ఘనకార్యాన్ని హైలైట్ చేస్తూ, కాపు సామాజిక వర్గాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపైకి ఎగదోయాలన్నది చంద్రబాబు తాజా వ్యూహం. కానీ, చంద్రబాబు మంత్రాలకు చింతకాయలు రాలే పరిస్థితి లేదిప్పుడు.
కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదు. ఇదే విషయాన్ని పదే పదే వైఎస్ జగన్ కుండబద్దలుగొట్టేస్తున్నారు కూడా. కానీ, చంద్రబాబు మాత్రం.. తమ పార్టీకి చెందిన కాపు నేతలతో, రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతం చేయాలనీ, వైఎస్ జగన్ సర్కార్‌కి కంటి మీద కునుకు లేకుండా చేయాలనీ హుకూం జారీ చేశారట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఈ మేరకు టీడీపీ నానా యాగీకి సమాయత్తమవుతోంది.
ఆల్రెడీ, కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుల ముసుగులో కొన్ని పచ్చ చొక్కాలు, చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ల వరంపై వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్లు కూడా షురూ చేసేయడం గమనార్హం. చంద్రబాబు రాజకీయమే అంత.. కులాల పేరుతో కుంపట్లు రాజేయడం టీడీపీ అధినేతకు కొత్తమీ కాదు. కానీ, గతంలోలా చంద్రబాబు పప్పులు ఈసారి ఉడుకుతాయా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.