తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కవిత సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ను జోకర్‌గా అభివర్ణించడం, అందుకు ఆయన స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.
గ్రేటర్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. రాజకీయ నాయకులు ఎప్పుడేం సంచలన మాటలు మాట్లాడుతారో తెలియని పరిస్థితి. గ్రేటర్‌లో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలు ఒకదానికి మించి మరొకటి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలకు ఎమ్మెల్సీ కవిత కాస్త వ్యంగ్యం జోడించే ప్రయత్నం చేశారు. అయితే అది సీరియస్‌గా మారింది. గత ఎన్నికల్లో బండ్ల గణేష్ అనే జోకర్ ఉన్నాడన్నారు.
ఇప్పటి గ్రేటర్ ఎన్నికల్లో ఆ లోటు కనిపిస్తోందని తాను అనుకున్నట్టు తెలిపారు. కానీ ఇప్పుడు బండ్ల గణేష్ స్థానంలో బండి సంజయ్ కామెడీ షో చేస్తున్నారని వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. ఈ సారి కూడా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే విజయమని అమె అన్నారు.
బండ్ల, బండి అనే ఇంటి పేర్లు కలిసి రావడంతో, కవిత సెటైర్ వేశారని అర్థమవుతోంది. కానీ బండ్ల గణేష్ తనను అనవసరంగా రాజకీయాల్లో లాగడంతో , తన అభిప్రాయాల్ని చెప్పాలనుకున్నారు.
తనను పొలిటికల్ కమెడియన్‌గా కల్వకుంట్ల కవిత చిత్రీకరించడంపై బండ్ల గణేష్ నొచ్చుకున్నారు. దీంతో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. కవిత అన్నట్టు తాను జోకర్ కాదని, ఫైటర్ అని గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ప్రస్తుతం తనకు ఏ రాజకీయాలతో సంబంధం లేదని ట్వీట్ చేశారు.
ఇదే గ్రేటర్ ఎన్నికల కారణంగా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, మెగా బ్రదర్ నాగబాబు మధ్య ట్వీట్ వార్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ లోపు మరెన్ని సంచలనాలకు ఈ గ్రేటర్ ఎన్నికలు కేంద్రమవుతాయో చూడాలి.