జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతుంటే.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు ప్రస్తావిస్తూ ప్రత్యర్థుల్లో గుబులు పుట్టిస్తున్నారు.
తెలంగాణ జోలికొస్తే.. ఏకంగా ఢిల్లీ పీఠాన్నే కదిలిస్తానంటూ హైదరాబాద్ గడ్డ నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కూడా ఇలా పార్టీలన్నిటినీ కూటమిగా చేసి ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ధిక్కార స్వరం వినిపించారు. తీరా ఎన్నికల సమయానికి ఎవరి స్థానిక అజెండాతో వారు సైలెంట్ అయ్యారు.
అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మరోసారి కేసీఆర్ జాతీయ రాజకీయాలను తెరపైకి తెచ్చారు. ఏపీ సీఎం జగన్ మినహా తాను జట్టు కట్టాలనుకుంటున్న నాయకులు, పార్టీల లిస్ట్ ని గతంలోనే బైటపెట్టిన కేసీఆర్, ఇప్పుడు పూర్తి స్థాయిలో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు.
మూడో ప్రత్యామ్నాయంపై కీలక ప్రకటనలు చేస్తున్నారు. అవసరమైతే జాతి ప్రయోజనాల కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను, త్యాగాలకు సైతం వెనకాడను అంటూ తేల్చి చెబుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయంటున్న కేసీఆర్ దేశంలో కొత్త ప్రయోగం రావాల్సిన అవసరం ఉందని, దేశం ఒక కొత్త పంథాలో, కొత్త పద్ధతిని ఆవిష్కరించాలని, 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తానే బహుశా ఆ ఆవిష్కర్తను కావొచ్చని తేల్చి చెప్పారు.
జాతి ప్రయోజనాల కోసం తాను బాగా మేథో మథనం చేస్తున్నానని, ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే విననని కూడా భారీ డైలాగులు కొట్టారు.
అంతా బాగానే ఉంది కానీ.. ఇది కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రదర్శిస్తున్న స్టంట్ గా అభివర్ణిస్తున్నారు కొంతమంది. జాతి కోసం జాతీయ రాజకీయాలంటున్న కేసీఆర్.. గ్రేటర్ ఓటింగ్ పూర్తయితే మళ్లీ చప్పబడిపోతారని, ఫామ్ హౌస్ కే పరిమితమవుతారని, ఇలాంటి బెదిరింపుల్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సెటైర్లు వేస్తున్నారు.
తెలంగాణ జోలికొస్తే.. తాను కేంద్ర ప్రభుత్వానికి పోటీగా అందర్నీ కూడగడతానంటూ బీజేపీకి ఓ హెచ్చరిక పంపించేందుకే కేసీఆర్ ఇలాంటి ఎత్తుగడ వేస్తున్నారనే వాదన కూడా ఉంది.
ఏది ఏమైనా కానీ కేసీఆర్ మాత్రం ఈ దఫా తాడో పేడు తేల్చుకునేలా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఓసారి మిడిల్ డ్రాప్ అయిన ఆయన, ఈసారి పి.ఎస్.యు. కార్మికుల పక్షాన పోరాటం మొదలు పెట్టి, దాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఓ చిన్న పార్టీలా మారిపోయింది కాబట్టి.. అలాంటి కూటమికి తానే ఎందుకు నాయకత్వం వహించకూడదు అనుకుంటున్నారు కేసీఆర్. ఆలోచన బాగానే ఉంది కానీ, గ్రేటర్ ఎన్నికల తర్వాత దాన్ని ఆచరణలో పెడతారా? లేక ఎన్నికల వరకే దాన్ని వాడుకుని వదిలేస్తారా? అనే విషయంపైనే అనుమానాలున్నాయి.
ఆవిష్కర్తను అవుతానంటూ కేసీఆర్ ఆవేశంగా ప్రకటించారా? లేక, దాని వెనక వ్యూహాత్మక ఆలోచన ఉందా? అది కార్యరూపం దాలుస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది.