మీడియాపై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అవుతూనే ఉన్నారు. ఈ మధ్య లైవ్ ప్రెస్ మీట్లలో కేసీఆర్ కొంతమంది జర్నలిస్టులపై డైరెక్టుగా మాటల దాడి చేసిన సంగతి తెలిసిందే. వారి తీరు కేసీఆర్ కు నచ్చలేదు, అక్కడిక్కడే క్లాసు తీసుకున్నారు. ఇక కేసీఆర్ ప్రెస్ మీట్లలో కొన్ని కొన్ని పదాలు వింటే.. చాలా మంది ఆశ్చర్యపోవాల్సిందే. సోమవారం రోజు ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏవో సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను తప్పు పడుతున్న వారిని 'దరిద్రులు' అంటూ కామెంట్ చేశారు. ఇలా అటాక్ కొనసాగిస్తున్నారు తెలంగాణ సీఎం.
ఇక కరోనా వేళ కొంతమంది తప్పుడు రాతలు రాస్తున్నారంటూ మీడియా మీద కూడా విరుచుకుపడ్డారు. ఆల్రెడీ తెలంగాణలో మీడియా యాక్టివ్ స్టేటస్ లో లేదు. కేసీఆర్ ను ఢీ కొట్టి నిలవలేని విషయాన్ని అర్థం చేసుకుని ప్రో టీడీపీ మీడియా కూడా పూర్తిగా సరెండర్ అయిపోయింది ఆయనకు. అయినా కేసీఆర్ కు మనశ్శాంతి ఉన్నట్టుగా లేదు. ఈ సారి తప్పుడు వార్తలు రాసే వాళ్లకు కరోనా తగలాలంటూ శపించేశారు!
విపత్కర వేళ తప్పుడు వార్తలు రాసేవాళ్లపై చర్యలు ఉంటాయని, ప్రభుత్వం వద్ద ప్రతి రికార్డూ ఉంటుందంటూ కేసీఆర్ హెచ్చరించారు. చర్యలు తీసుకుంటాం అనడం వరకూ ఓకే, అయితే అలాంటి వార్తలు రాసే వాళ్లకు కరోనా తగలాలంటూ తను శాపం పెడుతున్నట్టుగా కేసీఆర్ ప్రకటించుకున్నారు. అయినా ఇదేంటి? ఎంత నచ్చకుంటే మాత్రం ఇలాంటి శాపాలా! ఒకవైపు ఎవరికీ కరోనా సోకకూడదు, ఎవరికైనా సోకితే వారికే కాదు, ఇతరులకూ ఇబ్బందే అంటూ చర్యలు తీసుకుంటున్న సీఎం హోదాలో ఉన్న కేసీఆర్… తనకు నచ్చని పనులు చేసే వారికి మాత్రం అదే కరోనా రావాలని శపించేశారు! అయినా కరోనా ఎవరికి వచ్చినా.. ఇతరులకూ ప్రమాదమే కదా? ఆగ్రహావేశంలో ఈ విషయాన్ని మరిచారా ముఖ్యమంత్రి గారూ?