కేసీఆర్‌ హ్యాపీయేనా..?

ఏ ప్రభుత్వమైనా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? అధికార పార్టీ ఎప్పుడు హ్యాపీగా ఫీలవుతుంది? మంచి పనులు చేసినప్పుడా? ప్రజలను ఆకర్షించే పథకాలు ప్రవేశపెట్టినప్పుడా? వేరే పార్టీ ప్రజాప్రతినిధులను అధికార పార్టీలోకి లాక్కున్నప్పుడా? ఇలాంటి పనులన్నీ…

ఏ ప్రభుత్వమైనా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? అధికార పార్టీ ఎప్పుడు హ్యాపీగా ఫీలవుతుంది? మంచి పనులు చేసినప్పుడా? ప్రజలను ఆకర్షించే పథకాలు ప్రవేశపెట్టినప్పుడా? వేరే పార్టీ ప్రజాప్రతినిధులను అధికార పార్టీలోకి లాక్కున్నప్పుడా? ఇలాంటి పనులన్నీ అధికార పార్టీకి సంతోషం కలిగించేవే. కాని ఇంతకంటే సంతోషం కలిగించే పని మరోటి ఉంది. అదేమిటంటే…చట్టసభలో అధికారికంగా ప్రధాన ప్రతిపక్షం అనేది లేనప్పుడు. ప్రధాని మోదీ అయినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయినా, రాష్ట్ర విభజన జరిగాక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు నాయుడిదైనా ఇదే ఆలోచన. సభలో ప్రతిపక్షాలను చూసి వీరు ముగ్గురూ చిరాకు పడిన, అసహనం వ్యక్తం చేసిన అనేక సందర్భాలున్నాయి. 'ప్రతిపక్షం అవసరమా?' అని కూడా వీరు కొన్నిసార్లు ప్రశ్నించారు.

ప్రతిపక్షమంటే అభివృద్ధి నిరోధకమంటూ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం అవసరం లేదన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఏ పార్టీ ఎల్లకాలం అధికారంలోనే ఉండదు కదా. కాని ఈ జ్ఞానం రాజకీయ నాయకులకు ఉండదు. సరే…అసలు విషయానికొస్తే, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా సంతోషంగా ఉన్నారని అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో అధికారికంగా ప్రతిపక్షమనేది లేదు కాబట్టి. కనీసం రెండంకెలు ఉన్న ప్రతిపక్షమేదీ ప్రస్తుతం సభలో లేదు. కేసీఆర్‌ కోరుకున్నది ఇదే. 'ఇదే ఇదే నేను కోరుకుందీ..ఇలా ఇలా చూడాలని ఉందీ'..అనే పాట మాదిరిగా అసెంబ్లీ దృశ్యం కనబడుతోంది. అధికార పక్షం ఒక్కటే 100 సీట్ల బండ మెజారిటీతో 'యముండా' అని అదేదో సినిమాలో సత్యనారాయణ వికటాట్టహాసం చేస్తున్నట్లుగా ఉంది. ఈ వంద సీట్లూ ఎన్నికల్లో గెల్చుకున్నవా? కాదు కదా.

అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడు నెలలు కాకముందే కాంగ్రెసోళ్లు పోలోమంటూ అధికార పక్షంలోకి దూకడంతో దక్కిన మెజారిటీ ఇది. ఫిరాయించిన కాంగ్రెసు ఎమ్మెల్యేలను ప్రజలు వారి నియోజకవర్గాల్లో అడ్డుకొని దాడులు చేసిన సంఘటనలూ జరిగాయి. తాము చచ్చీ చెడీ గెలిపిస్తే ఎందుకు పార్టీ మారారని జనం నిలదీస్తే ఈ ప్రబుద్ధులు నీళ్లు నమిలారు. టీఆర్‌ఎస్‌కు 2014 ఎన్నికల్లో బొటాబొటీ సీట్లు రాగా, 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చింది. కాంగ్రెసు 19 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షమైంది. ఇది కేసీఆర్‌కు నచ్చలేదు. ఇంతమంది కాంగ్రెసోళ్లు సభలో ఉండటమేమిటని అనిపించింది. 12 మందిని లాగేశారు. బంగారు తెలంగాణ సాధన కోసం, కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ముచ్చటేసి అధికార పార్టీలోకి వెళుతున్నామని ఎప్పటి మాదిరిగా రికార్డు వేశారు. ఫిరాయించినవారు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ తరపున గెలిచారా అంటే అదీ లేదు. కండువాలు మార్చుకొని అధికార పార్టీ సభ్యులైపోయారు.

పైగా కాంగ్రెసు శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్‌పీలో విలీనం చేసినట్లు ప్రకటించారు. ఇదంతా రాజ్యాంగం ప్రకారమే జరిగిందట…! టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించినవారు పోగా ఏడుగురు మిగిలారు. వారిలో హుజూర్‌ నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పార్లమెంటు సభ్యుడయ్యారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెసు సభ్యులు ఆరుగురే మిగిలారు. కాంగ్రెసు కంటే మజ్లిస్‌ పార్టీకి ఓ స్థానం ఎక్కువుంది. టీడీపీకి 2 సీట్లున్నాయి. బీజేపీతోపాటు ఫార్వర్డ్‌ బ్లాక్‌ అనే పార్టీకి ఒక్క స్థానముంది. ఒకరు ఇండిపెండెంటు, మరొకరు నామినేటెడ్‌. ఇక అధికార పక్షం 'ఆడింది పాట…పాడింది ఆట'. ప్రతిపక్షం అక్కర్లేదనే కేసీఆర్‌ కల నెరవేరింది. చంద్రబాబు నాయుడు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు తాను ఎప్పుడూ నిలబడేవుంటానని, పడిపోయే ప్రసక్తే లేదని అనుకున్నారు. తాను శాశ్వత విజేతనని, అపజయం  లేనేలేదని భావించారు.

పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న గతాన్ని మర్చిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడిన ఆవేదనను, అధికారం కోసం పడిన తాపత్రయాన్ని,అప్పట్లో పాలకులపై తాను చేసిన విమర్శలను, పోరాటాన్ని బుర్రలోంచి తుడిచేశారు. బాబు మితిమీరిన అహంకారిగా మారిపోయారు.  ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీపై ద్వేషం హిమాలయమంత పెరిగిపోయింది. హుందాతనం పూర్తిగా పోయింది. 'దువ్వాడ జగన్నాథం' సినిమాలో అల్లు అర్జున్‌ 'గుడిలో బడిలో మదిలో ఒడిలో నీ తలపే ఓ లలనా' అని పాడుకున్నట్లుగా చంద్రబాబు కూడా తన పార్టీ సమావేశంలో, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలు…ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వైకాపాను, దాని అధినేత వైఎస్‌ జగన్‌ను పరుష పదజాలంతో విమర్శించకుండా వెళ్లేవారు కాదు.

అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని, వాటిని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకున్నారు. 'అభివృద్ధిని అడ్డుకుంటున్నారు' అనడం ఆయనకు ఊతపదంగా మారింది. మోదీ, కేసీఆర్‌, చంద్రబాబు ఎవరైనా సరే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు అడ్డుపడతున్నాయని కవర్‌ చేసుకోవడం  టెక్నిక్‌. పాలనలో వైఫల్యాలను, లోపాలను, అవినీతిని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించిన పార్టీలు, నాయకులు దుష్టశక్తులు. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్రమోదీ, తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలో ఉన్నారు. వీరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రతిపక్ష్లంలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు టీఆర్‌ఎస్‌, బీజేపీ దుష్టశక్తులవుతాయి.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ టీడీపీని దుష్టశక్తి అని, అభివృద్ధికి అడ్డుపడుతోందని అన్నారనుకోండి బాబు ఏం జవాబు చెబుతారు? తాను అధికారంలో ఉండగా వైకాపాను అదే మాట అన్నారు కాబట్టి గమ్మున ఉండాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నోరు మూసుకొని కూర్చున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదా? ఇప్పుడు జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలేదా? ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదు. ఇది రాచరిక పాలనా కాదు. జగన్‌ పాలన విషయం అలా ఉంచితే ఆయన ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం విభిన్నమైన నేతగా నిలబెట్టింది. మోదీ, కేసీఆర్‌, చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షాలను బతకనీయని నాయకులుగా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. మోదీ, కేసీఆర్‌ ముందు జగన్‌ రాజకీయంగా చిన్నవాడు. అయినప్పటికీ 'ఆయన్ని చూసి నేర్చుకోండి' పాలకులకు సలహాలు ఇస్తున్నాయి ప్రతిపక్షాలు.
-నాగ్‌ మేడేపల్లి

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది